రెండు దశాబ్దాలుగా ఆ దంపతులు పేద ప్రజల కోసం పనిచేస్తున్నారు. తమ సంపాదనలో ఎక్కువ భాగాన్ని 'సంక్షేమ పెన్షన్' రూపంలో పేదలకు విరాళంగా అందజేస్తున్నారు. డిజిటల్ సేవా కేంద్రం ద్వారా ప్రభుత్వం అందించే పథకాలు, సేవలను పొందడంలో పేదలకు అండగా నిలుస్తున్నారు. సుమారు 150 కుటుంబాలు పేదరికాన్ని అధిగమించేందుకు కృషి చేశారు. వారే కేరళ కొడంగల్లూర్‌కు చెందిన దంపతులు షినోద్ పీసీ, బిందు. తమ కష్టాన్ని ఇతరులకు పంచాలనే ఆలోచన వారికెలా వచ్చిందో తెలుసుకుందాం.
'డబ్బు అనేది తమ జీవితంలో అత్యంత విలువైనదని, అది మాత్రమే ఆనందాన్ని కలిగిస్తుందని ఎక్కువమంది నమ్ముతారు. అది తప్పు. నా దృష్టిలో సమయం చాలా విలువైంది' అంటున్నారు ఎల్‌ఐసి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న షినోద్. సామాజిక సేవలపై దృష్టి పెట్టడం కోసం ఈ మధ్యే ఆయన విఆర్‌ఎస్ (పదవీ విరమణ) తీసుకున్నారు.
వరకట్న వ్యతిరేకి
షినోద్‌కు 1996లో ఉద్యోగం వచ్చింది. తనవంతుగా ఈ సమాజానికి ఏదైనా చేయాలని అప్పుడే నిర్ణయించుకున్నారు. 'నేను సంపాదించే డబ్బంతా మాకు అవసరం లేదు. జీవించడానికి దానిలో కొంతభాగం మాత్రమే మా కుటుంబానికి సరిపోతుంది. మిగిలిన వాటిని అవసరమైన వారికి సహాయం చేయాలి అనుకున్నాం. అందుకోసం స్వచ్ఛంధ సంస్థను ప్రారంభించా' అంటున్నారు షినోద్. 1998లో ఆయన బిందూను వివాహం చేసుకున్నారు. 'మాది పెద్దలు కుదిర్చిన పెళ్లి. మేము మొదటిసారి కలిసినప్పుడు పెళ్లికి మెడలో చిన్నగొలుసు, రెండు గాజులు తప్ప నగలేమీ వేసుకోకూడదు అని షినోద్ చెప్పారు. కొంత సమయం మాట్లాడిన తర్వాత అతను వరకట్నానికి పూర్తి వ్యతిరేకని, ఉన్నతమైన భావాలు కలిగిన వ్యక్తని అర్థమైంది. ఆలోచించకుండా అతనితో పెళ్లికి అంగీకరించా. ఆనాటి నుంచి ఆయన అడుగుజాడల్లోనే నడుస్తూ, పేద కుటుంబాలకు సహాయం చేయాలనే లక్ష్యాన్ని ఏర్పరచుకున్నా' అంటున్నారు కొడంగల్‌లో భారతీయ విద్యాభవన్‌లో మ్యాథ్స్ టీచర్‌గా పనిచేసే బిందు.
ఎన్నో కష్టాలొడ్డి..
నిరుపేద కుటుంబంలో పుట్టి, పెరిగారు షినోద్. కుటుంబ అవసరాలరీత్యా పదేళ్ల వయస్సులోనే పేపర్‌బారుగా పనిచేశారు. 'నాన్న తీవ్ర అనారోగ్యంతో బాధపడేవారు. ఆయనకు మందులు కొనివ్వలేని దుస్థితి మాది. ఏడో తరగతి చదువుతున్నప్పుడే కుటుంబ బాధ్యత మొత్తం నా భుజాలపై పడింది. నా అరకొర సంపాదనతోనే కుటుంబాన్ని నెట్టకొచ్చేవాళ్లం. కడుపు నిండా భోజనం చేయని రోజులు చాలానే ఉన్నాయి. పదో తరగతి చదువుతున్నప్పుడు నాన్న మాకు దూరమయ్యారు. అన్ని కష్టాలను ఓర్చుకుంటూనే పుస్తకాలను చదివేవాడిని. నాకే ఎందుకు ఇలా జరుగుతోంది? మనం ఎందుకు కష్టపడాలి? అని ఎప్పుడూ అనుకునేవాడిని. నా ప్రశ్నలకు పుస్తకాలలోనే సమాధానాలు దొరికేవి. కొన్ని పుస్తకాలు చదవడం ద్వారా, కొన్ని విలువలు మన జీవితాలపై ప్రభావం చూపుతాయని గ్రహించాను. కాబట్టే భిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నా. ఆ విలువలను అనుసరించాలని నిర్ణయించుకున్నా' అంటున్నారు షినోద్.
ఆశా కార్యకర్తల సాయంతోనే..
'మేం చేసే సహాయం ఒక పద్ధతి ప్రకారం అర్హులకు అందాలని నిర్ణయించుకున్నాం. మా కుటుంబ అవసరాలు పోనూ.. ప్రతినెలా చాలా డబ్బును ఆదా చేసేవాళ్లం. అందుకోసం 2008 నుంచి ఆశా కార్యకర్తల సహాయం తీసుకున్నాం. ఆర్థిక సహాయం అవసరమైన కుటుంబాలను గుర్తించి, వారి వివరాలను ఆశా కార్యకర్తలకు ఇచ్చేవాళ్లం. వారిలో అత్యంత అర్హులైన కుటుంబాలను ఎంచుకోవడానికి మేం కొన్ని ప్రమాణాలను నిర్ణయించుకున్నాం. మద్యపానం, ధూమపాన వ్యసనపరులున్న కుటుంబాలకు ఎలాంటి సహాయం చేయకూడదు అనుకున్నాం. మా నియమం ప్రకారం ఆశా కార్యకర్తలు అర్హులను గుర్తించి, లిస్టును మాకు ఇస్తారు. మేమూ ఒకసారి ఆ ఇళ్లను సందర్శించి, వాస్తవాలను తెలుసుకుని నెలవారీ సంక్షేమ ఫెన్షన్ అందిస్తాం. మా ఇంటికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న సుమారు 500 కుటుంబాలకు మా సహాయం అందుతుంది. మేమెక్కడా ప్రచారం చేయము. అంతా ఆశా కార్యకర్తల ద్వారానే జరుగుతుంది. మా జీతంలో నుంచి దాచిన డబ్బును సుమారు 150 కుటుంబాలకు ఆర్థిక సహాయం చేశాం. నెలలో ప్రతి మొదటి ఆదివారం ఆ కుటుంబాలను సందర్శించి రూ.300 నుంచి రూ.2 వేల వరకు విరాళంగా అందజేస్తాం. వీరిలో ఆర్థిక పరిస్థితి మెరుగైన కుటుంబాలను గుర్తించి, వారికి బదులుగా మరో కొన్ని కుటుంబాలను ఆ జాబితాలో చేర్చుకుంటాం' అంటున్నారు షినోద్, బిందు దంపతులు.
ఇంతకు ముందులా ఇవ్వలేం..
ఐదు సంవత్సరాల క్రితం షినోద్ విఆర్‌ఎస్ తీసుకున్నారు. ప్రస్తుతం ఎక్కువ సమయాన్ని సామాజిక సేవలోనే గడుపుతున్నారు. 'ఉద్యోగంలో ఉన్నప్పుడు దాదాపు లక్ష రూపాయలు జీతం పొందేవాడిని. నేడు నా జీతంలో దాదాపు 1/5 వంతు పెన్షన్ పొందుతున్నాను. బిందు ఇంకా ఉద్యోగం చేస్తూనే ఉంది. మేం ఇప్పటికీ విరాళాలు ఇవ్వగలుగుతున్నాం. కానీ గతంలో ఇచ్చినంత ఇవ్వలేకపోతున్నాం. అలాగే మేం సహాయం చేసే కుటుంబాల సంఖ్యా తగ్గింది. ఇప్పుడు ఆశా వర్కర్ల సహాయం తీసుకోవడం లేదు. మేమే స్వయంగా సందర్శించి, పేదలను గుర్తిస్తున్నాం. సంక్షేమ పెన్షన్‌ల రూపంలో ప్రతినెలా రూ.20 వేల రూపాయలను పంపిణీ చేస్తున్నాము. అదనంగా మెడికల్ ఎమర్జెన్సీలు, వివాహాల కోసం నెలవారీ మొత్తాన్ని అందిస్తాము' అంటున్నారు షినోద్.
'నేను మూడేళ్లుగా ఈ దంపతుల నుంచి సహాయం పొందుతున్నాను. ప్రతి నెలా రూ.500 పెన్షన్ ఇంటికి తెచ్చిస్తారు. అంతేకాకుండా ప్రభుత్వం నుంచి పెన్షన్‌నూ పొందుతున్నా' అంటోంది శాంతకుమారి అనే 72 ఏళ్ల వృద్ధురాలు. ఇంట్లోనే ఏర్పాటుచేసిన డిజిటల్ సేవా కేంద్రం ద్వారా 2021 నుంచి పేదలకు ఎనలేని సేవలు అందిస్తున్నారు షినోద్ దంపతులు. వీరికి ఇద్దరు కుమారులు. ఒకరు బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నారు. మరొకరు ప్రభుత్వ కళాశాలలో ఇంజనీరింగ్ చేస్తున్నారు. 'మానవసేవే మాధవసేవ' అని నమ్మిన ఈ దంపతులు ఎందరికో ఆదర్శం.