రెండో సెమిస్టర్ పుస్తకాలు సిద్ధం
ఎండియు వాహనాల ద్వారా పాఠశాలలకు సరఫరా
డిఇఒ పి.శ్యాంసుందర్
ప్రజాశక్తి - ఏలూరు టౌన్
జగనన్న విద్యా కానుక కిట్ల స్టాక్ పాయింట్లలో ఉన్న రెండో సెమిస్టర్‌కు సంబంధించిన పుస్తకాలను ఎండియు వాహనాల ద్వారా పాఠశాలలకు పంపుతున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి పి.శ్యాంసుందర్ తెలిపారు. పుస్తకాల పంపిణీకి సంబంధించి ఏలూరు సెయింట్ జెవియర్ ఉన్నత పాఠశాలలో ఉన్న మండల ఎన్‌టి బుక్స్ స్టాక్ పాయింట్‌ను మంగళవారం డిఇఒ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో జగనన్న విద్యాకానుక కిట్లను స్టాక్‌పాయింట్ల నుంచి ఉపాధ్యాయులకు అప్పగించేవారమన్నారు. వారు ఆటోలు, ద్విచక్ర వాహనాల్లో పాఠశాలలకు తరలించుకునే వారని తెలిపారు. దానివల్ల ఉపాధ్యాయులు పలు అవస్థలు పడటాన్ని ప్రభుత్వం గుర్తించిందన్నారు. ఈ నేపథ్యంలో స్టాకింగ్ పాయింట్ల నుంచి ఎండియు వాహనాల ద్వారా పాఠశాలలకు పంపాలని ప్రభుత్వం నిర్ణయిందన్నారు. సెమిస్టర్-2 పుస్తకాల పంపిణీ నుంచి ఈ విధానం అమల్లోకి వస్తుందన్నారు. మంగళవారం నుంచి పంపిణీ ప్రారంభమవుతుందని డిఇఒ చెప్పారు. పంపిణీ సమయంలో ఎంఇఒలు, సిఆర్‌పిలు, ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేయాలని, పాఠశాలకు అవసరం ఉన్నంత వరకే పంపిణీ జరగాలన్నారు. జగనన్న విద్యా కానుక కిట్లు అందలేదనే మాట విద్యార్థుల నుంచి రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం స్టాక్ పాయింట్లలో ఉన్న పుస్తకాలను పరిశీలించారు. ఆయన వెంట ఏలూరు ఎంఇఒ ఆర్.రంగయ్య, జెవియర్ పాఠశాల ఆంగ్ల, తెలుగు మాధ్యమ ప్రధానోపాధ్యాయిలు తోట రోజారాణి, రాజ్ ప్రసాద్, సిఆర్‌పిలు దారం సునీత, దివ్య, సంధ్య, ఖాన్, లక్ష్మీ పాల్గొన్నారు.










