Aug 04,2023 23:54

ఆందోళన చేస్తున్న ఎన్‌టిపిసి కాంట్రాక్టు కార్మికులు

ప్రజాశక్తి - పరవాడ
ఎన్టీపీసీ సింహాద్రిలో కాంట్రాక్ట్‌ కార్మికులకు డస్ట్‌ అలవెన్స్‌ అగ్రిమెంట్‌ చేయాలని, ఐడెంటి కార్డుపై ఎన్‌టిపిసి లోగో ఉండాలని, వైద్య పరీక్షల పేరుతో కార్మికులను వేధింపులకు గురి చేయడం ఆపాలని తదితర సమస్యలపై అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యాన కార్మికులు చేపట్టిన సమ్మె రెండో రోజు శుక్రవారం కూడా కొనసాగింది. ఈ సందర్భంగా కెఎం.శ్రీనివాస్‌, గనిశెట్టి సత్యనారాయణ (సిఐటియు), ఎన్‌.రామచంద్రరావు, పెంటారెడ్డి (ఐఎన్‌టిసి), ఎం.అప్పలనాయుడు (టిఎన్‌టిసి), ఎంవి.నాయుడు, బి.రమణ మాట్లాడుతూ డస్ట అలవెన్స్‌ అగ్రిమెంట్‌ పూర్తయి రెండు సంవత్సరాలు కావస్తున్నా యాజమాన్యం మొండిగా నిర్లక్ష్యంగా బాధ్యతారహితంగా వ్యవహరించడం దుర్మార్గమన్నారు. సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమ్మె శిబిరానికి స్థానిక ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌ చేరుకొని మద్దతు ప్రకటించారు. యాజమాన్యం సమస్య పరిష్కరించే వరకు అండగా ఉంటానని కార్మికులకు ఆయన భరోసా ఇచ్చారు. ఆందోళనలో భాగంగా ఎన్‌టిపిసి మెయిన్‌ గేట్‌ నుండి పరిపాలన భవనం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిపి నాయుడు, బంగారు బాబు, కేరెడ్డి అప్పలరాజు, ఎంపీపీ పైలా వెంకట పద్మా లక్ష్మి శ్రీనివాసరావు, పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొన్నారు. దీనిపై ఎన్‌టిపిసి యాజమాన్యాన్ని ప్రజాశక్తి సంప్రదించగా, కార్మికుల డిమాండ్లపై ఎన్టిపిసి యాజమాన్యం, ట్రేడ్‌ యూనియన్లకు మధ్య చర్చలు కొనసాగుతున్నాయని, త్వరలోనే పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.