పార్వతీపురంరూరల్: అంగన్వాడీలకు తెలంగాణ రాష్ట్రం మాదిరిగా వేతనాలు పెంచాలని, సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ చెల్లించాలని, రెగ్యులర్ చేయాలని, కనీస వేతనం అమలు చేయాలని ఎపి అంగన్వాడీ వర్కర్స్, ఆయాలు చేపట్టిన 36 గంటలు నిరసన ధర్నా రెండో రోజు మంగళవారం కలెక్టరేట్ వద్ద అంగన్వాడీ వర్కర్లు, ఆయాలు కథం తొక్కారు. రెండు రోజులుగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట వంట వార్పు చేసుకొని, సెలవులు పెట్టీ నిరసన ధర్నాలో వేలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట రోడ్డుపై మొక్కవోని దీక్షతో ఎక్కడా పట్టుసడలకుండా ప్రతికూల వాతావరణం ఉన్నా తమ సంకల్పబలం నిరూపించి ప్రభుత్వం గుండెల్లో రైళ్లు పరుగెత్తించారు. జిల్లా వ్యాప్తంగా 15మండలాల నుండి 4వేలమందికి పైగా అంగన్‌వాడీలు రెండవరోజు మంగళవారం ఉదయం 6గంటలకే దూరాభారం లెక్కచేయకుండా ప్రయివేట్ వాహనాల్లో దీక్షా శిబిరానికి హాజరై తమ సత్తాచాటారు. ప్రజా నాట్య మండలి సభ్యులు కోరాడ ఈశ్వరరావు అంగన్‌వాడీ కార్యకర్తల సమస్యలపై పాడిన పాటలు ఆలోచింపజేశాయి. అనంతరం కార్యకర్తలతో కలెక్టర్ కార్యాలయం నుండి పార్వతీపురం పాతబస్టాండు వరకూ భారీ ర్యాలీ నిర్వహించి అక్కడ మానవహారం చేపట్టారు. అనంతరం డిఆర్‌ఒ జె.వెంకట్రావుకు వినతిని అందజేశారు.
ఈ సందర్భంగా ధర్నానుద్దేశించి అంగన్‌వాడీ వర్కర్స్, హెల్పర్స్ జిల్లా గౌరవ అధ్యక్షులు ఎం.ఉమామహేశ్వరి, అధ్యక్ష కార్యదర్శులు పి.సరళ, జి.జ్యోతిలక్ష్మి కోశాధికారి, బిఅమరవేణి, రాష్ట్ర కమిటీ నాయకులు విరామలక్ష్మి మాట్లాడుతూ తల్లీపిల్లల ఆరోగ్యపరిరక్షణలో, చిన్నారుల ఆలనాపాలనలో తమదైన కీలకపాత్ర నిర్వహిస్తున్న అంగన్‌వాడీలు చాలీచాలని జీతాలతో పనికి తగిని వేతనం లభించక, అనేక ఆర్థిక ఇబ్బందులతో జీవనం సాగిస్తున్నారన్నారు. ఎప్పటికప్పుడు పెరుగుతున్న నిత్యవసర వస్తువుల ధరలు, దీనికితోడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచుతున్న విద్యుత్, గ్యాస్ ధరలతో కుటుంబాలను పోషించుకోలేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధుల వత్తిడులు తీవ్రమైన మనోవేదనలకు గురిచేస్తున్నాయని అన్నారు. ఏళ్లతరబడి పనిచేస్తున్న కార్యకర్తలకు రూ11500, ఆయాలకు రూ.7500 మాత్రమే వేతనం ఇస్తున్నారని, ప్రభుత్వాలు వేతనాలు పెంచుతామని ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకపోవడంతో ఆగ్రహించి, తమ ఆవేదన వ్యక్తం చేయడాని కోసం ఇలా రోడ్డెక్కాల్సిన పరిస్ధితి దాపురించందని తెలిపారు. ఇప్పటికైన ప్రభుత్వాలు కళ్లుతెరిచి అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించకపోతే అందోళన ఉధృతం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. సమస్యలు పరిష్కరించకుంటే భవిష్యత్తులో సిఎం ఇంటిని ముట్టడిస్తామన్నారు. తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న అంగన్‌వాడీలకు న్యాయం జరిగే వరకూ అండగా ఉంటామని సిఐటియు జిల్లా అధ్యక్షప్రధాన కార్యదర్శులు డి.రమణారావు, వై.మన్మధరావు, నాయకులు వి.ఇందిర, జి.వెంకటరమణ, రైతుసంఘం నాయకులు బంటు దాసు, డివైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శులు ఎం.వెంకటరమణ, పి.రాజశేఖర్, కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు బివి రమణ సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు కె.సాంబమూర్తి, పి.సన్యాసిరావు, బి.లక్ష్మి, పెద్దసంఖ్యలో అంగన్‌వాడీలు పాల్గొన్నారు.










