Feb 12,2022 11:02

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో కాంగ్రెస్‌కు షాక్‌నిస్తూ.. ఆ పార్టీ అభ్యర్థి సలీమ్‌ ఖాన్‌ సమాజ్‌వాదీ పార్టీ(ఎస్‌పి)లోకి జంప్‌ అయ్యారు. అమ్రోహా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా సలీం ఖాన్‌ పోటీ చేస్తున్నారు. రాష్ట్రంలో రెండవ దశ ఎన్నికలకు ముందు ఈ పరిణామం చోటుచేసుకుంది. కమ్యూనికేషనల్‌ గ్యాప్‌ కారణంగానే పార్టీకి రాజీనామా చేస్తున్నాని సలీమ్‌ఖాన్‌ తెలిపారు. కాంగ్రెస్‌లోని ద్వితీయశ్రేణి నాయకత్వంపై కోపంతోనే ఎస్‌పిలోకి చేరిపోయారు. క్షేత్రస్థాయిలో పరిస్థితి గురించి పార్టీ అధిష్టానానికి తెలియజేసేందుకు ప్రయత్నించానని, రాహుల్‌, ప్రియాంక గాంధీలను కలవాలనుకోగా.. ద్వితీయ శ్రేణి నాయకత్వం అంగీకరించని నేపథ్యంలో.. విసిగిపోయి.. అఖిలేష్‌ నేతృత్వంలోని ఎస్‌పిలోకి వెళ్లిపోయినట్లు సలీమ్‌ తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీలో సమన్వయ లోపం ఉన్నదని, అందుకే ఎస్పీలో చేరానని ఆయన వెల్లడించారు. యుపిలో ఏడు దశల్లో ఎన్నికలు ఉండగా.. ఇప్పటికే తొలి దశ పోలింగ్‌ ముగిసింది. రెండవ దశ పోలింగ్‌ ఈ నెల 14న జరగనుంది.