Oct 30,2022 22:55

మధ్యలో నిలిచిపోయిన రహదారి నిర్మాణ పనులు..

నిధులు మంజూరైనా సాగని రోడ్డు నిర్మాణం
ప్రజల కష్టాలు పట్టించుకోని అధికారులు, నేతలు
ప్రభుత్వ నిర్లక్ష్యంపై టిడిపి మండల అధ్యక్షుడు మండిపాటు
ప్రజాశక్తి -మారేడుమిల్లి :
మండలంలోని చావడికోట పంచాయతీ తుర్రవాడ గ్రామానికి కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని టిడిపి మండల అధ్యక్షుడు గురుకు శేషుకుమార్‌ ఆరోపించారు. ఈ గ్రామానికి రెండేళ్ల క్రితం రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరైతే, సంబంధిత కాంట్రాక్టర్‌ అప్పట్లోనే రోడ్డుమధ్యలోనే మెటల్‌ వేసి, పనులు చేపట్టకుండా వదిలేశాడన్నారు. దీంతో రెండేళ్లుగా రోడ్డు మధ్యలో రాకపోకలకు అడ్డంకిగా ఉన్న మెటల్‌ కుప్పలతో స్థానిక గిరిజనులు నానా అవస్థలు పడుతున్నా ప్రభుత్వానికి పట్టకపోవడం శోచనీయమన్నారు. ఆయా గ్రామాలకు బైక్‌లతో సహా అన్ని వాహనాల రాకపోకలు నిలిచి రెండేళ్లవుతుందంటే గిరిజనుల సమస్యల పట్ల ప్రభుత్వం, అధికారయంత్రాంగం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో స్పష్టమౌతోందని శేషుకుమార్‌ మండిపడ్డారు. రోడ్డు ఉన్నప్పటికీ, మధ్యలో పెద్దగా వేసిన మెటల్‌ కుప్పలు గర్భిణులు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు ఆసుపత్రికి వెళ్లాలంటే డోలి మోతలే శరణ్యమౌతున్నాయన్నారు. ప్రభుత్వం, అధికారులు నిర్వాకం ఉన్న ఉన్న మట్టిరోడ్డుకూడా అందుబాటులో లేకుండా చేసి, గిరిజనానికి కాలినడకే శరణ్యమయ్యేలా చేశారని దుయ్యబట్టారు. ఆ గ్రామంలో తాగునీరు, విద్యుత్‌, ఇతరత్రా కనీస సౌకర్యాలు లేక మన్యవాసులు అవస్థలు పడుతున్నా ప్రభుత్వానికి, ఐటిడిఎ అధికారులకు చీమకుట్టినట్టయినా లేకపోవడం విచారకరమన్నారు. గిరిజన సంక్షేమానికి ఐటిడిఎ ద్వారా అన్నీ చేస్తున్నామని ప్రకటనలు గుప్పిస్తున్న పాలకులు, నేతలు, అధికారులకు తుర్రువాడ వాసులకు నిర్లక్ష్యంతో కల్పించిన కొత్త కష్టాలు కనిపించడం లేదాయని ప్రశ్నించారు. గ్రామంలో 18 మంది విద్యార్థులు ఉన్నప్పటికీ, పాఠశాలకు ఉపాధ్యాయుడు లేకపోవడంతో ఆగస్టు నెల నుంచి గిరిజన బాలలు విద్యకు దూరమవుతున్నారని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు కళ్లుతెరిచి, తుర్రువాడలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని శేషుకుమార్‌ డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో పంచాయతీ సర్పంచ్‌ సాదల ప్రేమ్‌ కుమార్‌ రెడ్డి, ఉప సర్పంచ్‌ అందాల సరస్వతి, వార్డ్‌ సభ్యులు సాదల శ్రీనివాస్‌ రెడ్డి గ్రామస్తులు పాల్గొన్నారు.