May 30,2021 07:59

   నవరత్నాలే తారకమంత్రం అన్న భావన నుంచి బయిటపడి రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ప్రత్యామ్నాయ వనరుల సమీకరణకు చర్యలు చేపట్టడం, ఉద్యోగులు చిరుద్యోగులు కాంట్రాక్టు ఔట్‌సోర్సింగ్‌ తదితరులను ఆదుకోవడం ముఖ్యం. రాజకీయంగానూ పాలనా పరంగానూ ఈ ప్రభుత్వం తెచ్చిపెట్టుకున్న సమస్యలు చాలానే వున్నాయి. గంగవరం రేవులో వాటా అదానీకి అమ్మకం, విజయ డెయిరీ ఆస్తులను పరోక్షంగా అమూల్‌ పరం చేయడంతో సహా అన్ని రంగాలలోనూ ప్రభుత్వేతర సంస్థలకే పెద్ద పాత్ర లభిస్తున్నది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా శాసనసభ తీర్మానం చేసింది గాని దాని ఆస్తుల అమ్మకంతో కాపాడుకోవచ్చని ముఖ్యమంత్రి గతంలో ప్రతిపాదించిన విధానం మారలేదు. రైతుల సమస్యలు, ఇసుక సరఫరా, అధిక ధరలు వంటి వాటిపై కూడా దృష్టి పెట్టాల్సి వుంది.
   వై.ఎస్‌. జగన్‌ మోహన్‌ రెడ్డి రెండేళ్ల పాలనను సంతోష సంతకంగా పాలకపక్షం ప్రచారం చేసుకుంటున్నది. ఈ కాలాన్ని సింహావలోకనం చేసినపుడు సంక్షేమ పథకాల అమలు సానుకూల అంశంగా కనిపించడంలో ఆశ్చర్యం లేదు. పాదయాత్రలో ప్రచారానికి ప్రధాన అస్త్రంగా పెట్టుకున్న నవరత్నాలనే సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి జగన్‌ తన నిబద్ధతకు కొలబద్దలుగా ప్రజల విశ్వాసం పొందే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతివారం ఏదో ఒక పథకానికి నిధుల విడుదల, దాని గురించి వివరించడం, ప్రచారంలో పెట్టడం, గత ప్రభుత్వం వైఫల్యాలను ప్రస్తావించడం ఒక ఫార్ములాగా చేసుకున్నారు.
 

                                                                  రాజకీయ మార్పు

   2011లో ఏర్పడిన వైఎస్‌ఆర్‌సిపి నూట యాభై స్థానాలకు పైగా తెచ్చుకుని ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఎ.పి లో కొత్త రాజకీయ పరిస్థితికి దారితీసింది. ఉమ్మడి ఎ.పి ని లేదా విభజిత ఎ.పి ని కాంగ్రెస్‌ తెలుగుదేశం మాత్రమే పాలించాయి. ఒక కొత్త ప్రాంతీయ పార్టీ ఏర్పడి పదేళ్ల లోనే అత్యధిక మెజార్టీతో అధికారానికి రావడం దేశంలో కూడా బలాబలాల పొందికపై ప్రభావం చూపించే అంశమైంది. అయితే కేంద్రం లోని మోడీ ప్రభుత్వం పట్ల జాతీయంగా బిజెపి రాజకీయ ఆధిపత్యం పట్ల జగన్‌ సానుకూలత ఆ పార్టీకి ఉపయోగకరంగా మారింది. ఇతర కొన్ని రాష్ట్రాలలో వలె ఎ.పి లో రెండు ప్రాంతీయ పార్టీల మధ్య రాజకీయ వైరం కేంద్రీకృతమైంది. టిడిపి కూడా బిజెపి పట్ల అనుకూల వైఖరినే అనుసరించడం వల్ల వీరి ఘర్షణ రాష్ట్రానికే పరిమితమైంది. జగన్‌పై సిబిఐ కేసులు, ఆయనను 16 మాసాలు జైలులో వుంచడంపై టిడిపి విమర్శ కేంద్రీకృతమైనా ప్రజలు ఎన్నుకోవడం ఇప్పటికీ టిడిపి జీర్ణించుకోలేని విషయంగానే వుంది. ఈ కాలంలోనూ చాలా సార్లు జగన్‌ జైలుకు వెళతారనీ, ఈ ప్రభుత్వం పూర్తి కాలం కొనసాగదనీ ప్రధాన ప్రతిపక్షం, కొన్ని మీడియా, సోషల్‌ మీడియా సంస్థలు ప్రచారం చేస్తూ వచ్చాయి. న్యాయస్థానాలలో వ్యతిరేక తీర్పులు వచ్చినప్పుడల్లా అంతా అయిపోయిందన్నట్టు దుమారం నడిచింది. అవేవీ నిజం కాకపోగా ముఖ్యమంత్రి అధికారాన్ని స్థిరపర్చుకున్నారు. ప్రకటించిన ప్రకారం మరో ఆరు మాసాలలో మంత్రివర్గాన్ని దాదాపు పూర్తిగా మార్చేస్తే అంతర్గతంగా ఆయన పట్టు మరింత పెరుగుతుంది.
 

                                               నవరత్న ఖచితమే, సమస్యలూ సత్యమే! 

   ఎన్నికల ప్రణాళికలో పొందుపర్చిన నవరత్నాలే తన పరిపాలనకు దిక్సూచి అని ముఖ్యమంత్రి జగన్‌ నిరంతరం ప్రకటిస్తుంటారు. ఆయన మంత్రులు, పార్టీ నేతలు కూడా అదే చెబుతుంటారు. రైతు భరోసా, అమ్మ ఒడి, విద్యా దీవెన ఈ పథకాల కింద ఏటా దాదాపు 90 వేల కోట్ల రూపాయలకు పైగా నేరుగా వారి వారి ఖాతాల్లో జమ చేసినట్టు ప్రభుత్వం చెబుతుంది. ప్రస్తుత ఆర్థిక సమస్యలు జీవన వ్యయం పెరుగుదల తాజాగా కరోనా విలయతాండవం మధ్య ఇది ప్రజలకు ఉపశమనం కలిగించే అంశమే. తద్వారా తాము వాగ్దానం చేసిన పథకాలకు కట్టుబడి వున్నామనే సంకేతాన్ని ప్రభుత్వం ప్రజల్లోకి తీసుకు వెళ్లగలిగింది. ఈ పథకాల అమలులో లోపాలు కూడా వున్నాయి. పలు సందర్భాలలో అర్హులందరికీ అందకపోవడం, అనర్హులకు అందడం, లబ్ధిదారుల జాబితాను కుదించడం కోసం రకరకాల ఆంక్షలు తీసుకురావడం జరుగుతూనే వుంటుంది. కౌలు రైతులు 34 లక్షల మంది వుంటే లక్షన్నర మందికే సహాయం అందించడంలో ఇది కొట్టవచ్చినట్టు కనిపిస్తుంది. 2021-22 బడ్జెట్‌లో సంక్షేమ పథకాలకు రూ. 48 వేల కోట్లు కేటాయించారు. ఎన్ని సమస్యలు వచ్చినా లబ్ధిదారుల ఖాతాలో జమ చేయడం గురించి చెప్పడం బాగానే వుంది గాని ఈ పథకాలు అమలు చేయడానికి అవసరమైన ఆర్థిక శక్తి పెద్ద సమస్య. గత ప్రభుత్వ నిర్వాకాలతో కలిపి ఇప్పటికే రాష్ట్రం 3 లక్షల యాభైఅయిదు వేల కోట్ల అప్పులో వుండగా మరో యాభై వేల కోట్లు అప్పు తేవాలని బడ్జెట్‌లో ప్రతిపాదించారు. కరోనా నేపథ్యంలో 2020-21లో పన్ను ఆదాయం రూ. 300 కోట్లు పడిపోగా ఖర్చు రూ. 18 వేల కోట్లు పెరిగింది. కేంద్రం నుంచి ఏదో అదనపు ఆదాయం వచ్చేస్తుందని ఆశించడానికి ఆధారమే లేదు. వనరుల కోసం ప్రభుత్వ స్థలాలను బిల్డ్‌ ఎ.పి పేరుతో అమ్మకానికి పెట్టడమే కనిపిస్తున్నది. కార్పొరేషన్ల ద్వారా అప్పులు తేవడానికి కొత్త కొత్త చిట్కాలు అనుసరిస్తున్నారు. సంక్షేమ పథకాలతో పోలిస్తే దీర్ఘకాలిక సమగ్రాభివృద్ధిపై దృష్టి కొరవడింది. 17 అభివృద్ధి అంశాలపై శ్రద్ధ పెట్టినట్టు చెబుతున్నా బడ్జెట్‌లో కేటాయింపులు గాని ప్రభుత్వ కార్యక్రమాల కేంద్రీకరణ గాని ఆ దిశలో లేవు. నీటిపారుదల ప్రాజెక్టులకు కేటాయిం పులు రెండు వేల కోట్లు మాత్రమే పెంచగా అదైనా అమలుకు రావడం ప్రశ్నార్థకమే. మౌలిక సదుపా యాలకు అయిదు వేల కోట్లు అన్నారు గాని విభజిత రాష్ట్ర అవసరాలకు అది ఏ మూలకు చాలదు. నాలుగు భవనాలు కట్టడమే అభివృద్ధి కాదని జగన్‌ అన్న మాట నిజమైనా స్థలాలు వెతికి మరీ అమ్ముకోవడం కూడా అభివృద్ధి కాబోదు. పారిశ్రామిక సేవా రంగాలలో అభివృద్ధి దెబ్బ తిని వ్యవసాయ రంగమే ప్రధాన వనరు కావడం ఉపాధి రీత్యానూ ఉత్పత్తి రీత్యానూ కూడా పరిమితులు కల్పిస్తున్నది. ఇప్పుడు 16 వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని చెబుతున్నారు గాని అవి ఆచరణలోకి రావాలి. నవరత్నాలే తారక మంత్రం అన్న భావన నుంచి బయిటపడి రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ప్రత్యామ్నాయ వనరుల సమీకర ణకు చర్యలు చేపట్టడం, ఉద్యోగులు, చిరుద్యోగు లు, కాంట్రాక్టు ఔట్‌సోర్సింగ్‌ తదితరులను ఆదు కోవడం ముఖ్యం. ఎందుకంటే ఈ ప్రభుత్వం వివిధ తరగతుల సంక్షేమ పథకాల గురించి చెబుతుంటే ఉద్యోగులు వరుసగా ఆందోళనలు, నిరసనలు చేపట్టవలసి వస్తున్నది. కరోనా కాలంలో ఎంతో అవసరమైన ఆశాలు, అంగన్‌ వాడీల వంటి వారు కూడా పోరాడక తప్పడం లేదు. పైగా సంక్షేమ పథకాలలో వారిని లబ్ధిదారు లుగా చేర్చడం లేదు. సందర్భోచితమైన ప్రాధాన్య తలు వుండాలి. నాడు నేడు పేరుతో బళ్లను బాగా అభివృద్ధి చేశారు గాని అవి జరిగే పరిస్థితి లేకపోవడం ఇందుకో ఉదాహరణ. ఈక్రమంలో చాలామంది టీచర్లు కరోనా బారిన పడ్డారు కూడా.
 

                                                 రాజధాని ప్రతిష్టంభన, రాజకీయ వివాదాలు

   రాజకీయంగానూ పాలనా పరంగానూ ఈ ప్రభుత్వం తెచ్చిపెట్టుకున్న సమస్యలు చాలా వున్నాయి. పాలనా వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానుల ప్రతిష్టంభన రెండో సంవత్సరమంతా కొనసాగింది. హైకోర్టు విచారణ 2021 చివరి వరకూ కొనసాగి ఆ పైన సుప్రీం కోర్టులో అప్పీలు వంటివి లెక్క లోకి తీసుకుంటే మూడేళ్లు పూర్తి కావచ్చు. విశాఖకు ఇదిగో అదిగో తరలింపు అని ప్రకటిస్తూ అక్కడ అనేక రకాల హడావుడి చేస్తూ అడుగేయలేని వాస్తవ పరిస్థితి. ఇప్పుడు తాజా బడ్జెట్‌లో కొత్త రాజధానికి 500 కోట్లు కేటాయింపు అంటే అది దేనికి ఎంత వెచ్చిస్తారో కూడా అర్థం కాని అయోమయం. అన్ని పార్టీలూ అంగీకరించిన హైకోర్టు తరలింపు దిశలో అడుగులు పడకపోవడం మరో విచిత్రం. ఇంగ్లీషు మీడియం, సిబిఎస్‌ఇ వంటి వాటిపై ఏకపక్ష నిర్ణయాలను కనీసం సమీక్షించుకోవడం లేదు. గంగవరం రేవులో వాటా అదానీకి అమ్మకం, విజయ డెయిరీ ఆస్తులను పరోక్షంగా అమూల్‌ పరం చేయడంతో సహా అన్ని రంగాలలోనూ ప్రభుత్వేతర సంస్థలకే పెద్ద పాత్ర లభిస్తున్నది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా శాసనసభ తీర్మానం చేసింది గాని దాని ఆస్తుల అమ్మకంతో కాపాడుకోవచ్చని ముఖ్యమంత్రి గతంలో ప్రతిపాదించిన విధానం మారలేదు. రైతుల సమస్యలు, ఇసుక సరఫరా, అధిక ధరలు వంటి వాటిపై కూడా దృష్టి పెట్టాల్సి వుంది. ఈ ప్రభుత్వమే ఉనికిలోకి తెచ్చిన గ్రామ వలంటీర్ల వ్యవస్థకు ప్రశంసలు వున్నా వారి పనిప్రతిఫలం వంటి అంశాలలోనూ సమస్యలున్నాయి. ఇంటింటికీ రేషన్‌ పేరిట వాహనాలు ఇచ్చి వినియోగిస్తున్న తీరు అనేక విమర్శలను ఎదుర్కొంటున్నది. గత ఎన్నికల కమిషనర్‌ తొలగింపు, స్థానిక ఎన్నికల నిర్వహణపై కోర్టుల వివాదాలు కొనసాగుతున్నాయి. విభజన సమస్యలు అలాగేే వున్నాయి. పోలవరం నిధులు, పునరావాస సమస్యల వంటివి అలాగే వున్నాయి. వెనకబడిన ప్రాంతాల పథకాలు కూడా పెద్దగా చేసింది లేదు.
 

                                                        ఆకస్మిక అరెస్టులు, నిరంతర కేసులు

   గత ప్రభుత్వ హయాంలో తప్పులపై చర్యలు తీసుకోవచ్చు. అయితే ఆ పేరుతో ఆకస్మికంగా టిడిపి నేతల అరెస్టులు, కూల్చివేతలు ఒక తతంగంగా మారాయి. పోలీసులు అధికార పక్షం చెప్పినట్టే వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు నిరంతరమయ్యాయి. హైకోర్టు ఎడతెగని కేసులతో ఒక రాజకీయ రణక్షేత్రంగా మారింది. పత్రికలు, ఛానళ్లు కూడా రాజకీయంగా రెండు శిబిరాలుగా మారిపోవడం, సోషల్‌ మీడియాలో ఇరు పక్షాల ప్రాయోజిక శక్తుల ప్రకోపాలు కలసి ఆడియో విజ్యువల్‌ వార్‌గా మారుతున్నది. ప్రమాణ స్వీకారం వేదిక నుంచే ముఖ్యమంత్రి జగన్‌ తన ప్రతికూల మీడియాపై పేర్లతో సహా ధ్వజమెత్తిన తీరు నానాట తీవ్రమవుతున్నదే గాని మార్పు లేదు. ఎం.పి రఘురామ కృష్ణంరాజు అరెస్టు ఉదంతం వీటన్నిటికీ అద్దం పట్టేలా తయారైంది. మీడియా స్వేచ్ఛ పట్ల ప్రభుత్వం సంయమనం లోపించడం ఒకటైతే కొన్ని మీడియా సంస్థలు ఏకపక్షంగా కథనాలు కూడా అభ్యంతరకరంగానే వున్నాయి. అయితే అది మీడియా స్వేచ్ఛపై దాడికి కారణం కారాదు. ఆలయాలపై దాడుల పేరిట మత వివాదాలు రెచ్చగొట్టడానికి బిజెపి, జనసేన చేసిన ప్రయత్నాలను రామతీర్థం వంటి సమస్యలపై టిడిపి దూకుడును ప్రజలు ఆమోదించలేదు కాని ఇప్పటికీ రాష్ట్రంలో కుల, మత, భాష లోనే వివాదాలు నడుస్తున్నాయి. వీటిని ఎదుర్కోవడానికి బదులు ప్రభుత్వం ఈ కరోనా కాలంలో ఆంజనేయుడి జన్మస్థలం వంటి వివాదాలను ముందుకు తేవడం హాస్యాస్పదం. వైసిపి, టిడిపి నేతలు కొందరు మంత్రులు కూడా అసభ్య దూషణల తోనూ కులాల భాష లోనూ మాట్లాడటం దుర్భరంగా సాగుతున్నది. టిడిపి కూడా రాజకీయంగా ఎదుర్కోవడం ప్రజల సమస్యలపై ఉద్యమించడం, గతంలో తప్పులనూ గుర్తించడం జరగాలి. పదేపదే కేంద్ర జోక్యాన్ని కోరడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని గ్రహించాలి. తమపై దాడుల రీత్యా తెలుగుదేశం వర్చ్యువల్‌ మహానాడులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సర్కారీ టెర్రరిజమని ఆరోపించారు గాని ఆయన హయాంలోనూ ఉద్యమాలపై తీవ్ర నిర్బంధం సాగిన మాట నిజం. ఈ విషయాలపై ప్రజలే తగు నిర్ణయానికి వస్తారు.
 

                                                           కరోనా సవాలు, కేంద్రంపై ఒత్తిడి

   ఏమైనా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా తాకిడి లోనూ ఎ.పి లో వివాదాలకు తెరిపి లేకపోవడం విపరీత పరిణామమే. సంక్షేమ పథకాలతో పాటు కరోనా నిరోధానికి బాధితుల సహాయానికి, చికిత్సకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం తక్షణ అవసరం. ఆక్సిజన్‌ ప్లాంట్లు, ఐసియు బెడ్లు పెంచి మందుల సరఫరా పెంచి ప్రజల ప్రాణాలు కాపాడాల్సి వుంది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణతో సహా కేంద్రం ప్రతికూల చర్యలే తీసుకుంటున్నప్పుడు వారినే నిరంతరం బలపరుస్తూ పోవడం అర్థం లేని విషయం. మూడో ఏడాదిలోనైనా ముఖ్యమంత్రి జగన్‌ రాష్ట్రం హక్కుల కోసం అందరినీ కలుపుకొని కేంద్రంపై ఒత్తిడి తేవడం అవసరం. రెండేళ్ల తీరును సమీక్షించుకుని తప్పొప్పులు సరిచేసుకుంటే మిగిలిన మూడేళ్ల కాలంలో మంచి ఫలితాలు అందించడం సాధ్యమవుతుంది.
 

తెలకపల్లి రవి

telakapalli ravi