రెండేళ్లలో 2,030 గుండె శస్త్రచికిత్సలు మీడియాతో టిటిడి ఈవో ఎవి ధర్మారెడ్డి
రెండేళ్లలో 2,030 గుండె శస్త్రచికిత్సలు
మీడియాతో టిటిడి ఈవో ఎవి ధర్మారెడ్డి
ప్రజాశక్తి - తిరుపతి బ్యూరో
టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయలో వైద్యులు రెండేళ్ల వ్యవధిలో రికార్డు సంఖ్యలో 2,030 గుండె శస్త్ర చికిత్సలు పూర్తి చేశారని టీటీడీ ఈవో ఏవి.ధర్మారెడ్డి తెలిపారు. అదేవిధంగా ఎనిమిది మందికి గుండె మార్పిడి శస్త్రచికిత్సలు చేయగా ఏడు విజయవంతం అయ్యాయని, వీరు ఆరోగ్యంగా జీవనం సాగిస్తున్నారని తెలియజేశారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి చిన్నపిల్లల హదయాలయలో బుధవారం ఈవో మీడియా సమావేశం నిర్వహించారు. ఈవో మాట్లాడుతూ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో చిన్నపిల్లల కోసం ఆసుపత్రి ఉండాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రివర్యులు వైఎస్.జగన్మోహన్ రెడ్డి 2021 అక్టోబరులో ఈ ఆసుపత్రిని ప్రారంభించారని తెలిపారు. ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో 15 మంది వైద్య బందం, నర్సుల బందం కలిసి ఎంతో అంకితభావంతో రోగులకు సేవలు అందిస్తున్నారని చెప్పారు. శస్త్రచికిత్సల్లో 95 శాతం సక్సెస్ రేట్ ఉందని వెల్లడించారు. సేవలకు గుర్తింపుగా ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో ఉత్తమ ఆసుపత్రిగా అవార్డు లభించిందన్నారు. ఆరోగ్యశ్రీతో పాటు కేంద్ర ప్రభుత్వ హెల్త్ స్కీమ్ కింద ఉచితంగా శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి మాట్లాడుతూ రోజుల వయసుగల పిల్లల నుంచి పెద్దల వరకు సంక్లిష్టమైన గుండె సమస్యలకు నిపుణులైన వైద్య బందంతో విజయవంతంగా శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎక్కువ ఖర్చుతోకూడిన హైరిస్క్ ఆపరేషన్లకు సీఎం రిలీఫ్ ఫండ్, ఎస్వీ ప్రాణదాన ట్రస్టు కింద పేదలకు ఉచితంగా గుండెవైద్యం అందిస్తున్నామన్నారు. ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరం లేకుండా నరం ద్వారా కవాటాలు మార్చడం, దమనుల శస్త్రచికిత్సలను ప్రత్యేకంగా నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. త్వరలో 350 పడకలతో సూపర్ స్పెషాలిటీ చిన్నపిల్లల ఆసుపత్రి నిర్మాణం పూర్తి కానుందని, ఇక్కడ కిడ్నీ, మెదడు, బోన్‌మ్యారో తదితర చిన్నపిల్లలకు సంబంధించిన అన్ని విభాగాలకు అత్యాధునిక వైద్యం అందుబాటులో ఉంటుందని వివరించారు. డాక్టర్ గణపతి సుబ్రమణ్యం మాట్లాడుతూ రాయలసీమ ప్రాంతంలో అవయవ మార్పిడిపై అవగాహన పెరగాలని, అవయవ మార్పిడికి ప్రజలు ముందుకు రావాలని కోరారు. గుండె మార్పిడి చేసుకున్న కర్నూలుకు చెందిన కోటేశ్వరరెడ్డి (32), గుంటూరుకు చెందిన సుమతి(31), కైకలూరుకు చెందిన కరుణాకర్(39)లతో ఈవో మాట్లాడారు. టిటిడి జేఈవో సదా భార్గవి, ఆర్‌ఎంఒ డాక్టర్ భరత్, ఆస్పత్రి వైద్యులు డాక్టర్ సౌమ్య, డాక్టర్ గణేష్ పాల్గొన్నారు.










