రాజంపేట అర్బన్ : పట్టణంలో రైల్వే అండర్ బ్రిడ్జిని (అర్‌యుబి) వెంటనే పూర్తి చేయాలని ఆర్‌యుబి సాధన సమితి ప్రతినిధి చిట్వేలి రవికుమార్ డిమాండ్ చేశారు. అర్‌యుబి నిర్మాణాన్ని పూర్తి చేయడంపై పాలకుల అలసత్వ వైఖరి వీడాలన్న డిమాండ్‌తో విద్యార్థుల తల్లిదండ్రులు, అసంఘటిత కార్మికులతో కలిసి ఆదివారం స్థానిక రైల్వే స్టేషన్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైల్వేశాఖకు సంబంధించి అర్‌యుబి పనులు ఆరేళ్ల కిందటనే పూర్తయ్యాయని, రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం వహించడంతో ఎక్కడ పనులు అక్కడే ఆగిపోయాయని పేర్కొన్నారు. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అవేదన వ్యక్తం చేశారు. రైల్వేస్టేషన్‌కు అవతలి వైపు ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జూనియర్, డిగ్రీ కళాశాలలు, కేంద్రీయ విద్యాలయం, ఎస్సీ, బీసి హాస్టళ్లున్నాయని. అందువల్ల విద్యార్థులు సైకిళ్ల పై ఫ్లై ఓవర్ బ్రిడ్జి మీద రాక పోకలు సాగిస్తున్నారని తెలిపారు. వాహనాలు అతివేగంగా వెళ్తున్నందున పలుమార్లు విద్యార్థులు ప్రమాదాల భారిన కూడా పడిన సంఘటనలు ఉన్నాయని తెలిపారు. హిందూ ముస్లిములకు సంబంధించిన శ్మశాన వాటికలు రైల్వే స్టేషన్ అవతలి వైపు ఉన్నాయన్నారు. అందువల్ల బలిజపల్లెరోడ్డు, గంగిరెడ్డిపాలెం, అర్‌ఎస్ రోడ్డు ప్రాంతాలకు చెందిన ఎవరైనా మరణిస్తే ఫ్లై ఓవర్ బ్రిడ్జి మీదుగా తీసుకు వెళ్లాల్సి వస్తుందన్నారు. అదనంగా దాదాపు ఒకకటిన్నర కిలోమీటరు దూరం మతదేహాన్ని తీసుకు వెళ్లాల్సి వస్తుందని వాపోయారు. ఆర్‌యుబి పూర్తయితే ఆ ప్రాంతంలోని చిరు వ్యాపారులకు ఉపాధి అవకాశాలు మెరుగు పడి వారి జీవన ప్రమాణాలు కూడా మెరుగు పడతాయని తెలిపారు. విద్యార్థులు, ప్రజల ప్రయోజనాలను దష్టిలో ఉంచుకొని వెంటనే రైల్వే అండర్ బ్రిడ్జిని పూర్తి చేసేందుకు ప్రజా ప్రతినిధులు, అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించకుంటే అర్‌యుబిని సాధించుకునేందుకు ఆందోళనలు ఉదతం చేస్తామని రవికుమార్ హెచ్చరించారు. కార్యక్రమంలో పగిడి సుబ్బరాయుడు, సుబ్రమణ్యంరెడ్డి, రమణ, రమేష్, సురేష్, తోట హరి, జిలానీ, శంకరయ్య, కాలేషా, రెడ్డప్ప పాల్గొన్నారు.










