Apr 27,2023 23:47

రెజ్లింగ్‌ క్రీడాకారుల ఆందోళనకు మద్దతు కార్యక్రమం నిర్వహిస్తున్న వివిధ ప్రజాసంఘాల నాయకులు

ప్రజాశక్తి-గుంటూరు : భారతదేశ కీర్తి ప్రతిష్టలను ప్రపంచవ్యాప్తంగా ఇనుముడింపజేసిన మహిళా రెజ్జర్లను లైంగిక వేధింపులకు గురిచేసిన బిజెపి ఎంపి బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌సింగ్‌పై మోడీ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వై.నేతాజి ప్రశ్నించారు. రెజ్లింగ్‌ క్రీడాకారులు ఢిల్లీలో చేస్తున్న ఆందోళనకు సంఘీభావంగా గురువారం గుంటూరు శంకర్‌ విలాస్‌ సెంటర్లో నిరసన తెలిపారు. నేతాజీ మాట్లాడుతూ క్రీడాకారిణిలను భారత రెజ్లింగ్‌ సమాఖ్య అధ్యక్షుడు, బిజెపి ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని ఫిబ్రవరిలో ఆందోళన నిర్వహించిన సందర్భంగా కేంద్రం ఇచ్చిన హామీని అమలు చేయలేదని అన్నారు. ఇప్పుడు మైనర్‌ క్రీడాకారిణిపై మళ్లీ లైంగిక వేధింపులకు పాల్పడిన నేపథ్యంలో అతనిపై చర్యలు తీసుకోవాలని నాలుగు రోజులుగా ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారన్నారు. దేశ రాజధానిలో క్రీడాకారులు ఆందోళన చేస్తుంటే ప్రధాని మోడీకి వినపట్లేదనా అని ప్రశ్నించారు. మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం ఊదాశీనంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఎం.కిరణ్‌, ఆవాజ్‌ రాష్ట్ర కార్యదర్శి ఎంఎ చిష్ఠి ఐద్వా నగర అధ్యక్షులు జి.రమణ, మెడికల్‌ రిప్రజెంటేటివ్స్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి అబ్దుల్‌ సలీం, డివైఎఫ్‌ఐ జిల్లా కన్వీనర్‌ వై.కృష్ణకాంత్‌, సిఐటియు నగర పశ్చిమ ప్రధాన కార్యదర్శి బి.ముత్యాలరావు, సిఐటియు జిల్లా కార్యదర్శి బి.లక్ష్మణరావు పాల్గొన్నారు.