
సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్
భీమవరం: సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని ఆ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు బొక్కా శ్రీనివాస్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ ఈ నెల 25న విజయవాడలో జరిగే ధర్నాలో జిల్లాలోని ఉద్యోగులంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు. స్థానిక యుటిఎఫ్ కార్యాలయంలో సమగ్ర శిక్ష కాంట్రాక్ట్, పార్ట్‌టైం ఉద్యోగుల జిల్లా సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలని, టైం స్కేల్ వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లా నాయకులు పి.సుబ్బారావు మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు. మహిళా ఉద్యోగులకు చైల్డ్‌కేర్ లీవులు అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఆనంద్, ఎం.బాలరాజు, రవి ప్రసాద్, పి.వినరు, టి.చినబాబు పాల్గొన్నారు.