Jul 20,2023 21:36

పార్వతీపురంలో దీక్షల్లో పాల్గొన్న మహిళా కార్మికులు

ప్రజాశక్తి - పార్వతీపురంటౌన్‌ :  తమను రాష్ట్ర ప్రభుత్వం పర్మినెంట్‌ చేసేంత వరకూ పోరాటం కొనసాగిస్తామని మున్సిపల్‌ కాంట్రాక్ట్‌ పారిశుధ్య కార్మికులు స్పష్టం చేశారు. గురువారం సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు వి.ఇందిర ఆధ్వర్యంలో మహిళా కార్మికులు మున్సిపల్‌ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలను చేపట్టారు. ఈ రిలే నిరాహార దీక్షను ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ జిల్లా అధ్యక్షులు ఎన్‌.శంకర్రావు, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు సింహాచలం, మల్లేష్‌ మహిళలకు దండ వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా కార్మికవర్గానికి ఎన్నో హామీలు ఇచ్చారని, పర్మినెంట్‌ చేసే సమయానికి మున్సిపల్‌ కార్మికులను కాకుండా మిగిలిన వారిని చేసి చేతులు దులుపుకోవడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఆప్కాస్‌ విధానాన్ని తీసుకొచ్చి కార్మికుల పొట్టకొట్టే చర్యలు పెట్టారని, చనిపోతున్న కార్మికుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఆప్కాస్‌ అడ్డుకుంటుందని, ఆప్కాస్‌ను రద్దుచేసి మున్సిపాలిటీల్లో చనిపోయిన కార్మికుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చిన న్యాయం చేయాలని, పర్మినెంట్‌ చేసే వరకు సమాన పనికి సమాన జీతం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రిలే నిరాహార దీక్షకు ఐద్వా జిల్లా కార్యదర్శి ఆర్‌ శ్రీదేవి మద్దతు తెలియజేస్తూ మున్సిపల్‌ కార్మికుల సమస్యల పరిష్కరించాలన్నారు. అంగన్వాడీ యూనియన్‌ నాయకులు కె.రాజేశ్వరి, మధ్యాహ్నం భోజన కార్మికసంఘం జిల్లా అధ్యక్షులు తులసి మద్దతు తెలిపారు. సిఐటియు నాయకులు ఇందిర మాట్లాడుతూ సమస్యలను పరిష్కరించకుంటే ఈనెల 27న మున్సిపల్‌ కార్యాలయాల ఆందోళన, ఆగస్టు 7న కలెక్టర్‌ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఎం.నిర్మల, పి.ప్రమీల, పి.సుజాత, భవానీ, ఉప్పలమ్మ, చిట్టమ్మ, సభ్యులు, పట్టణ పౌరు సంక్షేమ సంఘం నాయకులు పాకల సన్యాసిరావు పట్టణ నాయకులు సంచాన ఉమా దీక్షలకు మద్దతు తెలిపారు.
పాలకొండ: మున్సిపల్‌ ఆప్కాస్‌ కార్మికులందరినీ పర్మినెంట్‌ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని , చనిపోయిన కార్మిక కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇవ్వాలని, పట్టణంలో కార్మిక సంఖ్య పెంచాలని తదితర సమస్యల పరిష్కారం కోరుతూ స్థానిక నగర పంచాయతీ కార్యాలయం ఎదుట ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. సిఐటియు మండల సమన్వయ కమిటీ అధ్యక్షులు బి.అమరవేణి దీక్ష శిబిరాన్ని ప్రారంభించారు. పాలకొండ మహిళ న్యాయవాది పి.పద్మలత, అంగన్వాడి వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి ఎన్‌. హిమాప్రభ, ప్రాజెక్టు అధ్యక్షులు జి.జెస్సీ భారు, ఆశా వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు కె .గౌరీశ్వరి దీక్షలో కూర్చున్న మహిళలకు పూలదండలు వేశారు. చనిపోయిన కార్మిక కుటుంబాల సభ్యులు పడాల మల్లేశ్వరి, పడాల రాజమ్మ వారి భర్తల ఫోటోలతో కూర్చున్నారు. పడాల విమల, చింతల శ్రీదేవి, చింతల కష్ణవేణి, చింతల పున్నమ్మ, చింతల శారద, పడాల శాంతకుమారి, పడాల కమలమ్మ తదితరులు దీక్షలో ఉన్నారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు దావాల రమణారావు మాట్లాడారు. కార్యక్రమంలో మున్సిపల్‌ యూనియన్‌ నాయకులు పడాల భాస్కరరావు, చింతల సంజీవి, పడాల వేణు ,చింతల సురేష్‌ తదితరులు ఉన్నారు.
సాలూరు: స్థానిక మున్సిపల్‌ కార్యాలయం ఆవరణలో మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ జిల్లా కార్యదర్శి ఎన్వైనాయుడు ఆధ్వర్యాన మహిళా కార్మికులు నిరాహార దీక్ష చేపట్టారు. జిల్లా కార్యదర్శి ఎన్వైనాయుడు, పట్టణ అధ్యక్షుడు టి.రాముడు, కార్యదర్శి టి.శంకరరావులు దీక్షలో మహిళా కార్మికుల మెడలో పూలదండలు వేసి మద్దతు తెలిపారు. ఈ సంధర్భంగా ఎన్వైనాయుడు మాట్లాడుతూ మరణించిన కార్మికుల కుటుంబాలకు చెందిన వారికి ఉద్యోగాలు ఇవ్వకుండా మున్సిపల్‌ అధికారులు జాప్యం చేస్తున్నారని చెప్పారు. మున్సిపాలిటిలో పని చేస్తున్న కాంట్రాక్టు అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులను రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు టి.ఇందు, శ్రామిక మహిళా కన్వీనర్‌ టి.స్వప్న పాల్గొన్నారు.