
జిల్లా కలెక్టర్ ప్రశాంతి
ప్రజాశక్తి - భీమవరం రూరల్
పోలింగ్ స్టేషన్ల రేషనలైజేషన్ పగడ్బం దీగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టరు పి.ప్రశాంతి ఆదేశించారు. బుధవారం భీమవరం పురపాలక సంఘం పరిధి, రూరల్ గ్రామాల్లో ప్రకాష్‌నగర్, గునుపూడి, శ్రీరామపురం, రాయలం, వెంప, దురుసుమర్రు పోలింగ్ స్టేషన్లను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలింగ్ స్టేషన్ల గదులు, విద్యుత్తు, డోర్లు, కిటికీలు, టాయిలెట్స్, ర్యాంపు, పరిసరాలను జిల్లా కలెక్టరు క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు మాట్లాడుతూ ఎన్నికల ఘట్టంలో పోలింగ్ స్టేషన్ల రేషన్‌లైజేషన్ ప్రక్రియ అత్యంత ముఖ్యమైం దన్నారు. ఒకటికి రెండు సార్లు, అవసరమైతే మూడోసారి పరిశీలించిన అనంతరమే పోలింగ్ స్టేషన్ల మార్పులు, చేర్పులు, కొత్తవి ఏర్పాటుపై కచ్చితమైన నివేదికలు సమర్పించాలన్నారు. అన్నీ పూర్తయిన తరువాత నియోజకవర్గాల వారీగా ఇఆర్‌ఒలు సమర్పించిన నివేదికలను ఎన్నికల ప్రధానధికారి కార్యాలయానికి సమర్పించడం జరుగుతుందన్నారు. కొత్త పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలంటే 1,500 ఓటర్లు ఉండాలని, అలాగే ఇందుకనుగుణంగా ఈపి రేషియోను పరిశీలించి కొత్త పోలింగ్ స్టేషన్ ఏర్పాటుకు ప్రతిపాదనలను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టరు ఆదేశించారు. 1500 ఓటర్లు దాటితే రెండో పోలింగ్ స్టేషన్‌కు ప్రతిపాదనలు వెంటనే సమర్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డిఒ దాసి రాజు, పురపాలక సంఘం కమిషనర్ ఎం.శ్యామల, ఇన్‌ఛార్జి తహశీల్దారు జిఎన్.పవన్‌కుమార్ పాల్గొన్నారు.
భీమవరం : పోలింగ్ స్టేషన్లు ప్రజలకు అందుబాటులో ఉండేలా రేషనలైజేషన్ ప్రక్రియను పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి నియోజకవర్గ ఇఆర్‌ఒలను ఆదేశించారు. కలెక్టరేట్‌లో జెసి ఎస్.రామ్‌సుందర్ రెడ్డితో కలిసి తాడేపల్లిగూడెం, ఉండి, నరసాపురం, పాలకొల్లు నియోజకవర్గ ఇఆర్‌ఒలతో సమావేశమై పోలీస్ స్టేషన్ల రేషనలైజేషన్ ప్రక్రియను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు రెండు కిలోమీటర్ల పరిధిలోపు పోలింగ్ స్టేషన్‌ను కచ్చితంగా ఏర్పాటు చేయాలన్నారు. చేర్పులు, మార్పులు, కొత్త పోలింగ్ స్టేషన్ల ఏర్పాటుపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో చర్చించడంతోపాటు, స్థానిక ప్రజల విజ్ఞాపనలను కూడా పరిగణలోనికి తీసుకోవాలన్నారు. సమావేశంలో నియోజకవర్గ ఇర్‌ఒలు, ఎన్నికల సెక్షన్ సూపరింటెండెంట్ పాల్గొన్నారు.