ప్రజాశక్తి-సత్తెనపల్లి : రేషన్ ద్వారా బియ్యం మాత్రమే ఇస్తున్నారని కందిపప్పు, పంచదార అనేక నెలలుగా ఇవ్వడం లేదని సిపిఎం నాయకుల ఎదుట ప్రజలు వాపోయారు. బియ్యంతో పాటు కందిపప్పు, పంచదార ఇతర నిత్యావసర వస్తువులను సరఫరా చేసేలా చూడాలని కోరారు. సిపిఎం చేపట్టిన ప్రజారక్షణ భేరి పాదయాత్ర మూడవ రోజైన ఆదివారం పట్టణంలోని జండా చెట్టు, ధోబి ఘాట్, ముస్లిమ్ పాలెం, క్రిస్టియన్ పేట ప్రాంతాల్లో పర్యటించింది. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు మాట్లాడుతూ బిజెపి పాలిత రాష్ట్రాల్లో జరుగుతున్న దారుణాలు మహిళలపై జరుగుతున్న హత్యలు, అత్యాచారాలు, దాడులు చూస్తుంటే భవిష్యత్తులో మన పరిస్థితులు ఎలా ఉంటాయోనని భయంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాల పాలనలో అనుసరించిన ప్రజా వ్యతిరేక విధానాలతో విసిగిపోయి గత ఎన్నికల్లో వైసిపికి ఓట్లు వేస్తే ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి కూడా అవే విధానాలతో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మరికొందరు విమర్శించారు. ఒకవైపు పనులు లేక ఇబ్బందులు పడుతుంటే అదిక ధరలు, ఇంటి పన్ను, చెత్త పన్ను, విద్యుత్ ఛార్జీలు పెంచడంతో ఈ భారాలను మోయలేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. ముస్లిమ్ మైనార్టీల పిల్లలు చదువుకునేందుకు గతంలో మైనార్టీ కార్పొరేషన్ ద్వారా ఆర్థిక సహాయం చేసే వారని, ప్రస్తుత ప్రభుత్వం దాన్ని నిలిపేసిందని అసహనం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజయకుమార్ మాట్లాడుతూ ప్రజా సమస్యలను అధికార, ప్రతిపక్ష పార్టీలు గాలికి వదిలేసాయని అన్నారు. కేంద్రంలోని బిజెపి చెప్పినట్లు రాష్ట్రంలోని జగన్మోహన్‌రెడ్డి చేస్తున్నారని, అందులో భాగంగానే విద్యుత్ ఛార్జీల భారం ప్రజలపై మోపారని విమర్శించారు. కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి డి.విమల, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జి.రవిబాబు, నాయకులు కె.దుర్గారావు, ఎం.హరిపోతారాజు, రాజకుమార్ వి.రామారావు, ఎం.వెంకటనారాయణ, పి.రామారావు, ఆర్.పురుషోత్తం, కె.చంద్రశేఖర్ పాల్గొన్నారు.
ప్రజాశక్తి-ముప్పాళ్ల : మండలంలోని మాదలలోని పలు కాలనీల్లో పాదయాత్ర చేశారు. సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఏపూరి గోపాలరావు, మండల కార్యదర్శి జి.బాలకృష్ణ మాట్లాడుతూ జగనన్న కాలనీల పేరుతో మాదలలో 120 మందికిపైగా స్థలాలను ముప్పాళ్ల వెళ్లే డొంక వెంబడి ఇచ్చారని, అయితే నిర్మాణాలేమీ ఇంకా చేపట్టలేదని అన్నారు. ఇప్పటికైనా లబ్ధిదారులతో మాట్లాడి ఇళ్లు నిర్మించాలని, లబ్ధిదారులకు ఇచ్చే ప్రోత్సాహాన్ని పెంచాలని కోరారు. మాదల ఎస్సీ కాలనీలో ఎలిమెంటరీ పాఠశాల వద్ద తాగునీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. డ్రెయినేజీ వ్యవస్థ సరిగా లేని కారణంగా పలువరు రోగాల బారిన పడుతున్నారని చెప్పారు. గ్రామం మొత్తం విషజ్వరాలతో అల్లాడుతున్నారని, సత్వరమే పారిశుధ్యాన్ని మెరుగుపర్చడంతోపాటు వైద్యసేవలు అందించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు జి.జాలయ్య, పి.సైదాఖాన్, సిహెచ్.నాగమల్లేశ్వరరావు, ఐ.సత్యనారాయణరెడ్డి, వెంకటరెడ్డి, టి.బ్రహ్మయ్య, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.










