Jul 16,2023 21:35

పథకాన్ని నీరు గారుస్తున్న రేషన్‌ బియ్యం పంపిణీ వాహనం

పీలేరు : రేషన్‌ బియ్యం కోసం వినియోగదారులకు పరేషాన్‌ తప్పడం లేదు. చౌక దుకాణాల ముందు బియ్యం కోసం ప్రజలు పనులు మానుకుని, గంటల తరబడి నిరీక్షించే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇంటింటికి చౌక బియ్యం పంపిణీ చేయాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం రేషన్‌ బియ్యం సరఫరా కోసం కోట్లాది రూపాయలు వెచ్చించి ప్రత్యేక వాహనాలను కొనుగోలు చేసి వాటిని మండలాలకు పంపింది. వాటి నిర్వహణ కష్టంగా మారడంతో ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోతున్నాయి. దీంతో ప్రభుత్వం చెప్పేదొకటి క్షేత్రస్థాయిలో జరుగుతోంది మరొకటని, ప్రతిపక్షాలు చేస్తూన్న ఆరోపణలను రేషన్‌ దుకాణాల ముందు బారులు తీరుతున్న జనం దశ్యాలు బలాన్ని చేకూరుస్తున్నాయి. చౌక దుకాణాల్లో నిత్యావసర సరుకులు తీసుకునే లబ్ధిదారులు ఈ నెల నుంచి ఒక్కొక్కరు రెండుసార్లు బయోమెట్రిక్‌ ఇవ్వాల్సి వస్తుండడం, దానికి తోడు మిషన్లు మొరాయిస్తుండడంతో ప్రజలు చౌకదుకాణాల వద్ద బారులు తీయాల్సిన పరిస్థితి నెలొకంది. సిగల్స్‌ సక్రమంగా అందక పోవడంతో చౌక దుకాణాల్లో నిత్యావసర సరుకుల పంపిణీ మరింత ఆలస్యం అవుతోందని డీలర్లు చెబుతున్నారు. రేషన్‌ బియ్యం పంపిణీ గడువు ఆదివారంతో ముగియనుండడంతో లబ్ధిదారులు గంటల తరబడి ఎండలోనే నిరీక్షించారు. పీలేరు పట్టణం, ప్రకాశం రోడ్డులో రేషన్‌ షాప్‌ దగ్గర రాత్రి 8 గంటలకు కూడా రేషన్‌ బియ్యం కోసం కార్డుదారులు పడిగాపులు కాశారు. ఇంటింటికీ రేషన్‌ బియ్యం పంపిణీ కోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ప్రత్యేకంగా రేషన్‌ బియ్యం సరఫరా వాహనాలను సైతం సమకూర్చారు. పీలేరు మండల పరిధిలోని 15 పంచాయతీలకు 14 వాహనాలను ప్రభుత్వం కేటాయించింది. అధికారుల పర్యవేక్షణ లోపం ఫలితంగా ఈ పథకం ఆశయం కాస్తా అక్కడక్కడ నీరుగారుతోంది. ప్రభుత్వం అమలు చేస్తూన్న పథకాలలో ఇంటింటికి రేషన్‌ బియ్యం పంపిణీ పథకం గురించి గొప్పగా చెప్పుకునే ప్రజా ప్రతినిధులు, అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో కార్డుదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి, పథకాన్ని సక్రమంగా అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది.