రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా చేపట్టిన 'ఇంటి వద్దకే రేషన్ కార్యక్రమం' ఉద్దేశం మంచిదే, కానీ, అందుకు అనుసరించిన పద్ధతే బాగులేదు. రేషన్ షాపుల వద్ద భారీ క్యూలను నివారించేందుకు, నాసిరకం బియ్యానికి బదులు నాణ్యమైన స్వర్ణ మసూరి బియ్యం సరఫరా చేస్తామని ఎన్నికల ముందు జరిపిన పాదయాత్రలో ఇచ్చిన హామీని ఫిబ్రవరి 1 నుంచి అమలులోకి తెస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించినప్పుడు ప్రజల్లో వ్యక్తమైన ఆనందం నెల రోజుల్లోనే ఆవిరైపోవడానికి కారణమిదే. రేషన్ కోసం చౌకధరల డిపో ముందు క్యూల్లో గంటల తరబడి నిల్చొనే బాధ తప్పుతుందని, కల్తీ లేని నాణ్యమైన బియ్యం అందిస్తారని ఆశించిన లబ్ధిదారులను ఇది పరేషాన్ చేసింది. ఇంటి వద్దకే రేషన్ అందించేందుకు ఒక్కొక్కటి రూ.5.81 లక్షలు విలువ చేసే 9,260 సంచార వాహనాలను 60 శాతానికి పైగా సబ్సిడీపై రేషన్ సప్లై ఏజెంట్లకు ఇచ్చింది. ఉపాధి హామీ పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీస్ తదితర కార్పొరేషన్లతోబాటు పౌర సరఫరాల విభాగం నుంచి రూ. 700 కోట్లు ఇందుకోసం ప్రత్యేకంగా మళ్లించింది. ఆ మేరకు సంక్షేమంపై కోతపడినట్టే కదా. అంతేకాదు, ఇందుకోసం ఏటా రూ. 830 కోట్లు అదనంగా ఖర్చవుతుందని ప్రభుత్వమే చెబుతోంది. రేషన్ పంపిణీ ఏజెంట్లతో డీలర్లు, గ్రామ వలంటీర్లు, గ్రామ సచివాలయ సిబ్బందిని అందరినీ ఇందులోకి దింపింది. ఇంత హంగామా చేసి చివరికి ప్రభుత్వం సాధించిందేమీలేదు. అన్ని వైపుల నుంచి విమర్శలు మూటగట్టుకోవడం తప్ప. రేషన్ షాపుల వద్ద క్యూలు, ఇప్పుడు నడిరోడ్డుపై క్యూలుగా మారాయి. ఇంతకుముందు తీరిక సమయంలో రేషన్ దుకాణం వద్దకు వెళ్లి రేషన్ తెచ్చుకునే వెసులుబాటు ప్రజలకు ఉండేది. ఇప్పుడు పనులు మానుకుని సంచార వాహనం కోసం ఎదురు చూడాల్సి వస్తోంది. రోజు కూలీ మీద బతికేవారికి ఒక రోజు ఆదాయం నెల మొత్తం రేషన్ మీద ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీతో సమానం. రేషన్ కోసం పని మానుకోవాల్సి వస్తే ఆ కుటుంబానికి సబ్సిడీ బియ్యం పథకం వల్ల ఒరిగేదేమిటి? వీధి చివరన వాహనాలను నిలిపి ఉంచి పంపిణీ చేయడంతో రోడ్లపై గంటల తరబడి క్యూలో నిల్చోవాల్సి వస్తున్నది. దీనికితోడు ఎప్పటిలానే బయో మెట్రిక్ (ఫింగర్ ప్రింట్) మెషిన్లు మొరాయిస్తుండడంతో లబ్ధిదారుల అవస్థలు వర్ణనాతీతం. ఇన్ని బాధలుపడి తీసుకున్న రేషన్ అయినా నాణ్యంగా ఉంటుందా అంటే అదీ లేదు. ఏవో కొన్ని జిల్లాల్లో మినహా ఎక్కువ చోట్ల ఇప్పటికీ నాణ్యత లేని బియ్యమే సరఫరా చేస్తున్నారు. కందిపప్పు కిలో ధర రూ. 40 నుంచి రూ.67కి, పంచదార అర కిలో ధర రూ.12 నుంచి రూ.17కి పెంచేశారు. ఈ-పోస్ పరికరాల మొరాయింపు, రేషన్ లోడింగ్, పంపిణీకి ఇద్దరు వ్యక్తులు దాదాపు నెలంతా చాకిరీ, వాహనానికి ఇంధనం, రిపేర్లు వీటన్నిటిని కలిపితే ప్రభుత్వం ఇచ్చే రూ.21 వేలు ఏ మూలకు చాలడం లేదని వాహన సిబ్బంది అసంతృప్తితో ఉన్నారు. ఇంతమందిని అసంతృప్తికి గురి చేస్తున్న రేషన్ పంపిణీ విధానంలో లోపాలను సరిచేయడంపై ప్రభుత్వం దృష్టి సారించాలి. రెండేళ్ల కిందటే ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం ఈ విధానాన్ని ప్రవేశపెట్టి మధ్యలో వెనక్కి వెళ్లింది. గత ఏడాది దీనిని పునరుద్ధరించినా, అంచెలంచెలుగా అమలు చేస్తోంది. అక్కడ రేషన్‌ను ప్రాసెసింగ్ , ప్యాకింగ్ చేసి నేరుగా ఇంటివద్దకే అందించే కార్యక్రమం చేపడుతూనే, రేషన్ షాపుల ద్వారా కూడా అందిస్తోంది. ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్టవంతంగా అమలు చేయడంలో కేరళ నమూనా దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఆ అనుభవాలను పరిగణనలోకి తీసుకోవాలి. రాష్ట్రంలోని అన్ని స్థాయిల్లోను ఆహార సలహా మండళ్లను సమావేశపరచి వాటి సలహాలను కోరడంతోబాటు సంప్రదింపుల సాంప్రదాయాన్ని తిరిగి ప్రారంభించాలి. అధిక ధరల నుంచి ప్రజలను ఆదుకునేందుకు పెంచిన కందిపప్పు, పంచదార ధరలను వెంటనే తగ్గించడం, పదహారు రకాల నిత్యావసర సరుకులను రేషన్ కింద సరసమైన ధరకు సరఫరా చేయడం వంటివి చేపట్టాలి. రాష్ట్రంలోని 26 లక్షల మంది రేషన్ కార్డుదారులకే గాక, ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కూలీలకు కూడా రేషన్ అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి.










