Aug 29,2023 23:26

సరుకులు అందిస్తున్న ఎండియు ఆపరేటర్‌ (ఫైల్‌)సూర్యనారయణ, హేమసుందర్‌

* రెండుసార్లు వేలిముద్రలతో ఇబ్బందులు
* వెంటాడుతున్న సర్వర్‌ సమస్యలు
* పనిభారంతో ఎండియు ఆపరేటర్లు సతమతం
ప్రజాశక్తి - శ్రీకాకుళం ప్రతినిధి: 
మొబైల్‌ డిస్ట్రిబ్యూషన్‌ యూనిట్స్‌ (రేషన్‌ వాహనాలు) ద్వారా రేషన్‌ పంపిణీ మొదలు పెట్టిన నాటి నుంచి ఆపరేటర్లకు ఏదో రూపంలో కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. తొలుత వాహనాలకు చెల్లించాల్సి వాయిదా సొమ్ము కోసం కొంత కాలం పోరాడారు. తర్వాత వాహనాల ఇన్సూరెన్స్‌ డబ్బులను వారి వేతనాల నుంచి మినహాయించడంతో ఉన్నతాధికారుల చుట్టూ తిరిగారు. ఆ సమస్య పరిష్కారం అయ్యాక ఇప్పుడు తాజాగా మరో సమస్య వచ్చి పడింది. లబ్ధిదారులకు ఇప్పటివరకు ఒకసారి వేలిముద్రతో రేషన్‌ పంపిణీ చేస్తుండగా, ఈ ఏడాది జూలై నుంచి బియ్యానికి ఒకసారి, ఇతర సరుకులకు మరోసారి రెండుసార్లు వేలిముద్రలు తీసుకోవాల్సి రావడంతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. సమస్యను పరిష్కరించకుంటే వచ్చే నెల నుంచి విధులు నిర్వర్తించలేమని వారు తేల్చి చెప్తున్నారు.
రేషన్‌ సరుకులను డోర్‌ డెలివరీ చేసేందుకు ప్రభుత్వం మొబైల్‌ డిస్ట్రిబ్యూషన్‌ యూనిట్స్‌ (ఎండియు) వ్యవస్థను 2021, ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. వాహనాల ద్వారా రేషన్‌ పంపిణీ చేసేందుకు జిల్లాలో 422 మంది ఆపరేట్లను నియమించారు. డోర్‌ డెలివరీ చేసే ఆపరేటర్‌కు తొలుత ప్రభుత్వం రూ.16వేలు వేతనంగా నిర్ణయించింది. వాహనాలకు డ్రైవర్లుగా మాత్రమే పనిచేయాల్సి ఉంటుందని చెప్పిన ప్రభుత్వం తర్వాత వారితో తూకం, ఈ-పాస్‌ మిషన్‌లో వివరాలు నమోదు తదితర పనులు అప్పగించింది. దీంతో తమకు ఇస్తున్న వేతనం చాలదని నాలుగు రోజులు పనిచేసి ఆపేశారు. దీంతో ప్రభుత్వం వారితో చర్చలు జరిపి అప్పట్నుంచి నెలకు రూ.21వేలు వేతనంగా చెల్లిస్తోంది. అందులోనే ప్రతి నెల రేషన్‌ వాహనానికి సమకూర్చిన రుణానికి వాయిదా సొమ్ముగా రూ.3 వేలును జమ చేసుకుంటోంది. ప్రతి నెల రూ.18వేలు మాత్రమే అందడంతో అవి ఏ మూలకూ సరిపోవడం లేదు.
రెండుసార్లు వేలిముద్రలతో పంపిణీలో ఆలస్యం
ప్రభుత్వం ఇస్తున్న వేతనం చాలకపోయినా ఆర్థిక ఇబ్బందుల మధ్యే పంపిణీ సాగిస్తున్నారు. ఈ ఏడాది జూలై నుంచి రేషన్‌ పంపిణీ ప్రక్రియలో ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త విధానం వారికి తలనొప్పిగా మారింది. బియ్యానికి ఒకసారి, ఇతర సరుకులకు మరోసారి వేలిముద్రలు తీసుకుని సరుకులు అందించాలని ప్రభుత్వం ఆదేశించడంతో వారిపై తీవ్ర పనిభారం పెరిగింది. రెండు సార్లు తూకం వేయాల్సి రావడం, సర్వర్‌ సమస్యలతో ఒక్కో కార్డుదారుడి కోసం 15 నుంచి 20 నిమిషాల సమయం పడుతోంది. సిగల్‌ సమస్యలు తీవ్రంగా ఉన్న చోట అరగంట సమయం పడుతోంది. దీంతో కొన్ని ప్రాంతాల్లో లబ్ధిదారులు విసిగెత్తి ఆపరేటర్లతో గొడవకు దిగుతున్న పరిస్థితులు నెలకొన్నాయి.
ఆపరేటర్లకు పెరిగిన ఖర్చులు
రేషన్‌ పంపిణీలో రెండుసార్లు వేలిముద్రలు తీసుకోవాల్సి రావడంతో రేషన్‌ పంపిణీ కోసం ఆపరేటర్లు అదనపు రోజులు కేటాయించాల్సి వస్తోంది. గతంలో వారి పరిధిలోని కార్డుదారులకు 15 రోజుల్లోనే రేషన్‌ పంపిణీ చేసే పరిస్థితి ఉండగా ఇప్పుడు 20 రోజుల వరకు సమయం పడుతోందని చెప్తున్నారు. దీంతో పంపిణీ కోసం తీసుకొస్తున్న సహాయకుడికి అదనంగా డబ్బులు చెల్లిస్తున్నారు. ప్రభుత్వం ఇస్తున్న వేతనాలు చాలక అవస్థతలు పడుతున్న ఆపరేటర్లకు సహాయకులకు అదనంగా డబ్బులు చెల్లించాల్సి రావడంతో వారి ఆర్థిక ఇబ్బందులు మరింత ఎక్కువయ్యాయి. ఒకసారి వేలిముద్రతో సరుకులు అందించడం లేదా రెండుసార్లు వేలిముద్రల పంపిణీకి అనుగుణంగా ఒక్కో ఆపరేటర్‌కు అదనంగా రూ.5 వేలు చెల్లించాలని ఆపరేటర్లు కోరుతున్నారు.
సమస్య పరిష్కరించకుంటే విధులు నిర్వర్తించలేం
రేషన్‌ పంపిణీలో రెండుసార్లు వేలిముద్రలు తీసుకోవడం వల్ల ఆపరేటర్లపై తీవ్ర పనిభారం పెరిగింది. పని ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులతో చాలామంది మానేస్తున్నారు. రెండుసార్లు వేలిముద్రలు తీసుకోవడం, సర్వర్లు పనిచేయకపోవడంతో ఒక్కో కార్డుదారుడి కోసం అధిక సమయం కేటాయించాల్సి వస్తోంది. కార్డుదారులు అసహనంతో కొన్నిచోట్ల ఆపరేటర్లపై దాడులు చేస్తునానరు. దీంతో ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తోంది. ప్రభుత్వం ఒకే వేలిముద్రతో సరకులు అందించేలా చర్యలు తీసుకోవాలి. లేకుంటే ఒకటో తేదీ నుంచి విధులు నిర్వహించలేం.
- రౌతు సూర్యనారాయణ,
ఎండియు ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షులు


చాలా ఇబ్బందిగా ఉంది
సరుకులు ఇస్తున్న సమయంలో పొలం పనులు ప్రారంభం కావడం వల్ల అధికశాతం మంది గ్రామంలో అందుబాటులో ఉండటం లేదు. వారి కోసం రోజంతా ఎదురు చూడాల్సి వస్తోంది. ఒకేసారి అందరూ రావడం రెండు సార్లు వేలి ముద్రలు వేయిస్తుండటంతో ఎక్కువ సమయం పడుతోంది. పనులు మానుకుని వస్తున్న కార్డుదారులు అసహనానికి గురవుతున్నారు. ప్రభుత్వం వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలి.
- హేమసుందర్‌, ఎండియు ఆపరేటర్‌, బూర్జ