Sep 30,2023 23:22

రేషన్‌ కందిపప్పు కట్‌

రేషన్‌ కందిపప్పు కట్‌
-చేతులెత్తేసిన ప్రభుత్వం
-కార్డుదారులకు సబ్సిడీ లేనట్టే..
ప్రజాశక్తి - బాలాయపల్లి : కార్డుదారులకు సబ్సిడీపై ఇచ్చే కందిపప్పు విషయంలో ప్రభుత్వం చేతులెత్తేసింది. ఇక రేషన్‌తో పాటు కంది పప్పు పంపిణీ చేయలేమని తేల్చేసింది. ఐదు నెలల నుంచి కొన్ని ప్రాంతాలకే పరిమితం చేసిన ప్రభుత్వం రెండు నెలల నుంచి కేటాయింపులు నిలిపివేసింది. జిల్లా వ్యాప్తంగా 1,292 రేషన్‌షాపుల పరిధిలో 6.30లక్షల మంది తెల్లకార్డుదారులు ఉండగా ప్రతినెలా 639 మెట్రిక్‌ టన్నుల కందిపప్పును కేటాయించాల్సి ఉంది. కానీ ప్రభుత్వం ఐదు నెలల నుంచి కేటాయింపులు నిలి పేసింది. దీంతో పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వానికి భారం
బహిరంగ మార్కెట్లో కిలో కందిపప్పు రూ.150 పలుకుతుండగా రేషన్‌షాపుల ద్వారా సబ్సిడీపై రూ.67కు ఇవ్వడంతో ప్రభుత్వంకు అధనంగా భారం పెరిగిందని కందిపప్పు సరఫరాను ప్రభుత్వం ఆపేసింది. గ్రామాల్లో రేషన్‌ కార్డు లబ్ధిదారుల సమాచారం మేరకు కంది పప్పు ధర పెరగడంతోనే ప్రభుత్వం కొనడం లేదని డీలర్లే స్వయంగా చెబుతున్నారు. కార్డు దారులకు కొంత మంది రేషన్‌ సరుకులు వాహనదారులు ఇంటి వద్దకే వచ్చి సరుకులు ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు. గతంలో కొన్ని రోజులు సరుకులు ఇంటికి తీసుకొచ్చే వారు ప్రస్తుతం ఇవ్వడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కందిపప్పు పరిస్థితి ఇలా ఉండగా ప్రభుత్వం రేషన్‌ షాపుల ద్వారా గోధుమ పిండి పంపిణీకి శ్రీకారం చుట్టింది. గత నెలలో పంపిణీ చేయగా ఈ నెలలో కూడా కొనసాగించింది. అయితే జిల్లా వ్యాప్తంగా ఉన్న కార్డుదారు లందరికీ కాకుండా కేవలం పట్టణ ప్రాంతాలు (నగరపాలక సంస్థలు, మునిసిపాల్టీలు, నగర పంచాయతీలు)లకు మాత్రమే పరిమితం చేసింది. అటు కందిపప్పు నిలిపివేయడం, ఇటు గోధుమ పిండిని పట్టణ ప్రాంతాలకే పరిమితం చేయడంపై కార్డుదారులు మండి పడుతున్నారు.