ప్రజాశక్తి-రోలుగుంట:తమకు రేషన్ కార్డులు ఇప్పించాలంటూ మండలంలోని ఆర్ల పంచాయతీ పిత్రిగడ్డి గ్రామ గిరిజనులు ఆదివారం చేతులెత్తి జిల్లా కలెక్టర్‌ను వేడుకున్నారు. గ్రామంలో 12 కుటుంబాలు వారు జీవనం సాగిస్తున్నారు. 12 సంవత్సరాల నుండి రేషన్ కార్డుల కోసం అధికారులకు వినతిపత్రాలు అందజేసినా నేటికీ రేషన్ కార్డులు ఇవ్వ లేదన్నారు. పిత్రిగడ్డ గ్రామం నుండి శరభవరం సచివాలయంకి వెళ్లాలంటే పది కిలోమీటర్ల ప్రయాణం చేయాలని, అనేకసార్లు తిరిగితే రేషన్ కార్డ్ ఆప్షన్ లేదని, తర్వాత ఇస్తామని చెప్పి సచివాలయం సిబ్బంది చెబుతున్నారన్నారు. తమ గ్రామాలకు వాలంటీర్ లేక పోవడంతో స్వయానా శరభవరం వెళ్లి వాలంటీర్‌కి ఫిర్యాదు చేసినా రేషన్ కార్డ్ ఆప్షన్ వస్తే ఫోన్ చేస్తామని చెబుతున్నారన్నారు. నేటికీ పది సంవత్సరాలు అవుతున్నా రేషన్ కార్డులు లేక పోవడంతో బయట 50 కేజీల చొప్పున బియ్యం కొనుగోలు చేయాలంటే కనీసం 1200 రూపాయలు డబ్బులు అవుతున్నాయన్నారు. కూలి పని చేసుకుని జీవనం సాగిస్తున్న తమకు రేషన్ కార్డ్‌లు లేవన్నారు. తమ పిల్లలను స్కూల్లో జాయిన్ చేయడం కూడా అవ్వలేదని, క్యాస్ట్ సర్టిఫికెట్ కావాలంటే రేషన్ కార్డులో తమ పిల్లల పేర్లు ఉండాలన్నారు. రేషన్ కార్డు లేక తమకు అనేక ఇబ్బందులు గురవుతున్నామన్నారు. గ్రామ సచివాలయం ద్వారా అన్ని సేవలు అందిస్తామని చెబుతున్నా కొండ శిఖర గ్రామాలకు కనీసం రేషన్ కార్డు ఇవ్వక పోవడం బాధాకరమన్నారు.ఇప్పటికైనా రేషన్ కార్డులు ఇప్పించాలని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘ సభ్యులు సాధన కమిటీ జిల్లా గౌరవ అధ్యక్షులు కె.గోవిందరావు, మండల కార్యదర్శి శ్రీధర్, లక్ష్మణరావు డిమాండ్ చేశారు.










