Mar 21,2023 18:12

విలేకరులతో మాట్లాడుతున్న జెసి టి.నిశాంతి

రేషన్‌ కార్డుదారులకు బియ్యంకు బదులు జొన్నలు
- ఇప్పటి వరకు 2,060 మెట్రిక్‌ టన్నుల జొన్నలు సేకరణ
- భూ తగదాల పరిష్కరానికే రీ సర్వే : జెసి
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్‌

      చిరుధాన్యాల ప్రాధాన్యత పెంపొందించేందుకు రేషన్‌ కార్డుదారులకు బియ్యంకు బదులు జొన్నలు పంపిణీ చేయనున్నట్లు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ టి.నిశాంతి తెలిపారు. మంగళవారం జెసి ఛాంబర్‌లో తనను కలిసిన విలేకర్లతో జెసి పలు విషయాలను వెల్లడించారు. పాత కాలంలో చిరుధాన్యాలను ప్రజలు ఎక్కువగా వాడే వారన్నారు. ప్రస్తుతం వాటి వాడకం తగ్గిందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో చిరుధాన్యాల ప్రాధాన్యతను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఇంటర్నేషనల్‌ ఇయర్‌ అఫ్‌ మిల్లెట్‌ ప్రకటించిందన్నారు. చిరుధాన్యాల్లో ఫైబర్‌, మినరల్స్‌, విటమిన్‌ వంటి పోషకాలు ఉంటాయని, డయాభైటిస్‌ తగ్గడం కోసం చిరు ధాన్యాలు అవసరం అవుతాయానే ఉద్దేశ్యంతో బియ్యం బదులు జొన్నలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. నంద్యాల జిల్లాలో ఎక్కువగా జొన్నలు పండిస్తారని, అందువలన జొన్నలు సివిల్‌ సప్లై ద్వారా కొనుగోళ్లు ప్రారంభించామన్నారు. నేరుగా రైతుల వద్దకే వెళ్లి జొన్నలు కొనుగోలు చేస్తూ రెండు రోజుల్లోనే వారి ఖాతాల్లో సొమ్ము జమ చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఇప్పటివరకు 2,060 మెట్రిక్‌ టన్నులు జొన్నలు కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. ప్రభుత్వం నుండి అనుమతి రాగానే లబ్ధిదారులకు వారి ఇష్ట పూర్వకంగానే జొన్నలు ఇస్తామన్నారు.
భూ తగాదాల పరిష్కారానికే రీ సర్వే
భూ తగాదాల పరిష్కారానికే జిల్లాలో భూ రీసర్వే పనులు చేపడుతున్నట్లు జెసి పేర్కొన్నారు. హద్దులు గుర్తించి భూ యజమానుల నుండి అభ్యంతరాలు లేకుంటే పక్కాగా సరి హద్దులు నిర్ణయించి, భూ హక్కు పత్రాన్ని ఫీల్డ్‌ మ్యాప్‌తో ఇస్తామన్నారు. ఆళ్లగడ్డ, చాగలమర్రి, రుద్రవరం మండలాల్లో మొత్తం 9 గ్రామాల్లో రీసర్వే జరుగుతుందని, మొదటి, రెండవ దఫా రీ సర్వేలో దాదాపు 13 గ్రామాలు పూర్తి చేశామన్నారు. చుక్కల భూములు రెగ్యులరైజేషన్‌ సంబంధించి 1954 ముందు అసైన్‌మెంట్‌ అయివుంటే వాటిని రెగ్యులరైజేషన్‌ చేయడానికి వీలుంటుందని తెలిపారు. ఆ తరువాతి వాటికి ఎపి డాట్‌ ల్యాండ్‌ 2017 యాక్ట్‌ ప్రకారం రెగ్యులర్‌ చేయడానికి అవకాశం లేదన్నారు. ఆర్‌ఎస్‌ఆర్‌లో పేర్లు ఎక్కకుండా డాట్‌ ల్యాండ్‌ అని ఉంటుందని, 12 సంవత్సరాలు అనుభవంలో ఉన్నట్లు డాక్యుమెంటు అందజేస్తే తహసీల్దార్‌, ఆర్డీఓల ద్వారా కలెక్టరేట్‌కు వస్తే డిఎల్‌ఎస్‌ ద్వారా అప్డేసానైనా ఆర్‌ఎస్‌ఆర్‌ డాట్‌ ల్యాండ్‌ను రెగ్యులరైజేషన్‌ చేస్తామన్నారు.