Aug 17,2023 00:02

స్టాల్స్‌లో తయారు చేసిన వంటకాలను పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌

ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : ఎమ్‌డియు వాహనాల ద్వారా రేషన్‌ కార్డుదారులకు ఇంటి వద్దకే అందిస్తున్న ఫోర్టిఫైడ్‌ బియ్యాన్ని లబ్ధిదారులు ఆహారం రూపంలో కచ్చితంగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌, జెసి ఎ.శ్యామ్‌ప్రసాద్‌ సూచించారు. ఫోర్టిఫైడ్‌ బియ్యంతో వంటకాల తయారీ పోటీలను కలెక్టరేట్‌ ప్రాంగణంలో బుధవారం నిర్వహించగా పోటీలను జెసితో కలిసి కలెక్టర్‌ ప్రారంభించి మాట్లాడారు. ఐరన్‌, విటమిన్‌ బి12, ఫోలిక్‌ యాసిడ్‌ కూడిన బియ్యాన్ని గురించి వాస్తవాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి రేషన్‌ బియ్యం పట్ల ఉన్న అపోహలను తొలగించాలన్నారు. జిల్లాలో 10 మండల స్థాయి నిల్వ కేంద్రాల నుండి 1290 రేషన్‌ షాపులకు సరుకులు చేరవేయగా 402 ఎమ్‌డియు వాహనాల ద్వారా ఇంటింటికి పంపిణీ చేస్తున్నమన్నారు. జాతీయ ఆహార భద్రత చట్టం, రాష్ట్ర రేషన్‌ కార్డులు కింద నెలకు 9096.365 టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. కిలో బియ్యంపై రాయితీగా దాదాపు రూ.39.35 చొప్పున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తున్నాయన్నారు. మహిళలు, పిల్లల్లోని పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు, నాడీ వ్యవస్థ పని తీరు మెరుగుపడేందుకు ఈ ఫోర్టిఫైడ్‌ బియ్యం దోహదం చేస్తాయని వివరించారు. వీటిని ఇతరులకు అమ్మకుండా ఇంట్లోనే వండుకుని తీనాలని కోరారు. జెసి మాట్లాడుతూ ఈ బియ్యాన్ని ఉడికించేందుకు ప్రత్యేక విధానాలు అవసరం లేదని, సాధారణ బియ్యం ఉడికించినట్లే ఉడికించి వంట చేసుకోవచ్చని చెప్పారు. అన్నం లేదా ఇతర వంటకాలలైనా ఈ బియ్యంతో చేసుకోవచ్చని అన్నారు.
ఇదిలా ఉండగా వంటల పోటీల్లో ప్రతిభ చాటిన వారికి మహిళలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ప్రదానం చేశారు. మొదటి బహుమతిని ఎం.భూలక్ష్మి (మెప్మా) సాధించగా మిక్సి గ్రైండర్‌ను అందించారు. రెండో మెప్మా, రెండవ బహుమతి నర్మద (ఐసిడిఎస్‌) సాధించగా ఎలక్ట్రికల్‌ కుక్కర్‌, మూడో బహుమతిని సాధించిన శేషమ్మ (డిఆర్‌డిఎ)కు డిన్నర్‌ సెట్‌ను బహూకరించారు. పోటీల్లో పాల్గొన్న మరో 37 మందికి కన్సోలేషన్‌ బహుమతులు అందించారు. కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరా శాఖ అధికారి ఎస్‌.పద్మశ్రీ, ఏపీఎస్‌సీఎస్సీ డిఎం వరలక్ష్మి, ఐసిడిఎస్‌ పీడీ బి.అరుణ, డిఆర్‌డిఎ, మెప్మా పీడీలు బాలునాయక్‌, వెంకటనారాయణ పాల్గొన్నారు.