
ప్రజాశక్తి - రెడ్డిగూడెం: మండల కేంద్రం కొత్త రెడ్డిగూడెం శివారు గ్రామం దగ్గర విస్సన్నపేట మార్గంలో శుక్రవారం వేకువజామున రేషన్ బియ్యం అక్రమ తరలింపును అడ్డుకున్నారు. మైలవరం నుండి మీని లారీల ద్వారా అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న విషయాన్ని పాత్రికేయులు ఇచ్చిన సమాచారం మేరకు రెడ్డిగూడెం ఎస్‌ఐ శ్రీను తన సిబ్బందితో కలిసి మార్గం మధ్యలో లారీని వెంబడించి రెడ్డిగూడెం గ్రామ శివారు కొత్త రెడ్డిగూడెం ఊరు సమీపంలో అక్రమ రవాణాను అడ్డుకున్నారు. రెడ్డిగూడెం ఎస్‌ఐ శీను తెలిపిన వివరాల మేరకు.. మైలవరం నుండి మినీ లారీ ద్వారా అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నట్లు సమాచారం అందిందని ఆ మేరకు తమ సిబ్బందితో దాడులు నిర్వహించగా రెడ్డిగూడెం ఊరు శివారు సమీపంలో మినీ లారీని అడ్డుకున్నామన్నారు. ఈ లారీలో సుమారు రెండున్నర టన్నులు (3200 కేజీలు) రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. అక్రమ రవాణాకు పాల్పడిన సూత్రధారులు రేషన్ మాఫియా చేస్తున్న వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రరావు, ఏలూరు జిల్లా చాట్రాయి మండలం చిన్నంపేట గ్రామానికి చెందిన చింతకాయల గురునాథం అనే వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు పత్రిక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు పూర్తి వివరాలు సేకరిస్తున్నామన్నారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని ప్రస్తుతం పోలీస్ స్టేషన్‌లోనే ఉంచినట్లు రెడ్డిగూడెం ఎస్‌ఐ శ్రీను తెలిపారు.