Mar 04,2023 00:21
పట్టుబడిన రేషన్‌ బియ్యం

ప్రజాశక్తి-వేటపాలెం: జిల్లాలో రేషన్‌ అక్రమ రవాణా ఆగటం లేదు. సివిల్‌ సప్లర్సు అధికారులు వరుస దాడులు నిర్వహిస్తున్నా అక్రమార్కుల అరాచకం రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. తాజాగా శుక్రవారం తెల్లవారుజామున రెండున్నర గంటల సమయంలో వేటపాలెం మండలం పందిళ్లపల్లి గ్రామంలో అక్రమంగా తరలిస్తున్న 175 బస్తాల రేషన్‌ బియ్యం మినీ వ్యాన్‌ను డిఎస్‌ఒ విలియమ్స్‌ ఆధ్వర్యంలో దాడి చేసి పట్టుకున్నారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా డిఎస్‌ఒ విలియమ్స్‌ మాట్లాడుతూ పట్టుబడిన రేషన్‌ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా గుర్తించామన్నారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని వాహనాన్ని సీజ్‌ చేశామన్నారు. డ్రైవర్‌తో పాటు మరో ముగ్గురు పరారయ్యారని పేర్కొన్నారు. త్వరలో నిందితులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామన్నారు. ఈ దాడుల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డిటి ఓంకారం, ఆర్‌ఐ సురేష్‌ పాల్గొన్నట్లు చెప్పారు.