Oct 17,2023 20:59

సర్వర్‌ మొరాయించడంతో నిలిచిపోయిన రేషన్‌ పంపిణీ

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌ : మండలంలో గడువు తేదీ దాటి మూడు రోజులైనప్పటికీ రేషన్‌ బియ్యం పంపిణీ జరగకపోవడంతో రేషన్‌దారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రతి నెలా 15లోగా ఇంటింటికీ రేషన్‌ బియ్యం పంపిణీ జరగాల్సి ఉండగా గత పది రోజులుగా సర్వర్‌ సమస్య వల్ల రేషన్‌దారుల బయోమెట్రిక్‌ గుర్తింపు జరగకపోవడంతో రోజుకు కేవలం ఐదు, పది కార్డులకు మాత్రమే బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఈనెల 18వ తేదీ సమీపిస్తున్నప్పటికీ 50శాతం కూడా ఏ గ్రామంలోనూ రేషన్‌ పంపిణీ జరగకపోవడంతో వినియోగదారులు ఈనెల రేషన్‌ కోల్పోతామేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై మండల సివిల్‌ సప్లై డిప్యూటీ తహశీల్దార్‌ను ప్రశ్నించగా సాంకేతిక లోపం తలెత్తిన మాట వాస్తవమేనని, ఈ విషయమై జిల్లా అధికారులు దృష్టికి తీసుకువెళ్లామని, రేషన్‌ పంపిణీ గడువు ప్రాథమికంగా ఈ నెల 19 వరకు పొడిగించినప్పటికీ, నెలాఖరు వరకు రేషన్‌ పంపిణీ కొనసాగించాల్సిన అవసరం ఉందని తెలిపారు. అధికారులు ఆమోదం తెలిపితే రేషన్‌ పంపిణీ అందరికీ అందే వరకు కొనసాగిస్తామని తెలిపారు.