Jun 14,2023 22:28

మాఫియా తరహాలో బియ్యం వ్యాపారం
రేషన్‌ వాహనాల్లోనే కొనుగోలు ప్రక్రియ
బియ్యం ఇచ్చేది వారే.. కొనేది వారే అన్నట్లు పరిస్థితి
కిలో రూ.పదికి కొనుగోలు చేసి అదనంగా అమ్మకాలు
అధికారుల దాడుల్లో పట్టుబడేది నామమాత్రమే
బియ్యం నాణ్యత లేకపోవడమే విక్రయాలకు ప్రధాన కారణం
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి

రేషన్‌ బియ్యం అక్రమ వ్యాపారం రెండు జిల్లాల్లో మూడు పువ్వులు.. ఆరు కాయలు అన్నట్లు సాగుతోంది. పౌరసరఫరాల శాఖ, విజిలెన్స్‌ దాడుల్లో పట్టుబడుతున్న రేషన్‌ అక్రమ బియ్యం నామమాత్రమే. మాఫియా తరహాలో రేషన్‌ బియ్యం దందా సాగుతుందని చెప్పొచ్చు. దీని వెనుక బడాబాబులు సైతం ఉండటంతో అధికార యంత్రాంగం సైతం పెద్దగా పట్టించుకోవడం లేదనే విమర్శలు విన్పిస్తున్నాయి. రేషన్‌ బియ్యం కొనుగోలు, విక్రయాలన్నీ రేషన్‌ పంపిణీ చేసే వాహనాల ద్వారానే జరుగుతుండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. రెండు జిల్లాల్లో దాదాపు 11.73 లక్షల రేషన్‌కార్డులు ఉన్నాయి. ఏలూరు జిల్లాలో 6.39 లక్షల వరకూ ఉండగా, పశ్చిమలో 5.33 లక్షల కార్డులు ఉన్నాయి. రేషన్‌ కార్డులో ఉన్న ప్రతి వ్యక్తికీ ఐదు కిలోల చొప్పున బియ్యం ప్రభుత్వం అందిస్తోంది. రెండు జిల్లాల్లో 751 వరకూ వాహనాలు రేషన్‌ సరుకులను అందిస్తున్నాయి. ప్రతినెలా రెండు జిల్లాల్లోనూ మొత్తంగా 16,900 టన్నుల బియ్యం రేషన్‌ వాహనాల ద్వారా లబ్ధిదారులకు అందుతోంది. తాము అధికారంలోకి వస్తే రేషన్‌ దుకాణాల ద్వారా సన్న బియ్యం ఇస్తామంటూ వైసిపి హామీ ఇచ్చింది. అయితే అమలు మాత్రం లేకుండా పోయింది. రేషన్‌ వాహనాల ద్వారా ఇస్తున్న బియ్యం నాణ్యత లేకపోవడంతో చిమిడిపోయి ముద్దవుతున్న పరిస్థితి ఉంది. దీంతో రేషన్‌ బియ్యం అన్నం తింటే కడుపునొప్పి వంటి సమస్యలు వస్తున్నట్లు లబ్ధిదారులు చెబుతున్నారు. దీంతో రేషన్‌ బియ్యం విక్రయించి ఆ సొమ్ముకు మరికొంత సొమ్ము అదనంగా వేసి నాణ్యమైన బియ్యాన్ని కొనుగోలు చేసుకుని తింటున్న పరిస్థితి ఉంది.
యథేచ్ఛగా రేషన్‌ బియ్యం దందా..
జిల్లాలో రేషన్‌ బియ్యం దందా యథేచ్ఛగా సాగుతోంది. లబ్ధిదారుల నుంచి బియ్యం కొనుగోలు వ్యాపారమంతా రేషన్‌ వాహనాల ద్వారానే సాగుతున్న పరిస్థితి నెలకొంది. లబ్ధిదారులు ఎవరైనా బియ్యం వద్దనుకుంటే రేషన్‌ వాహనాల వద్దే కొనుగోలు సాగిపోతుంది. బియ్యం ఇచ్చినట్లు వేలిముద్ర వేయించుకుని వెంటనే కిలోకు రూ.పది చొప్పున సొమ్ము ఇచ్చేస్తున్నారు. వాలంటీర్ల నుంచి అందరికీ తెలిసే బియ్యం కొనుగోలు వ్యవహారం సాగుతోంది. ప్రతిరోజూ ఎంత బియ్యం ఇచ్చారు.. ఇంకా ఎంత బియ్యం వాహనాల్లో నిల్వ ఉందో తనిఖీలు చేస్తే బయటపడే అవకాశం ఉంటుంది. అయితే అది ఎక్కడా జరగడం లేదు. దీంతో బియ్యం కొనుగోలు అంతా బహిరంగంగానే సాగిపోతుంది. రేషన్‌ బియ్యం అక్రమ రవాణాపై అధికారులు చేస్తున్న దాడులు నామమాత్రమేనని చెప్పొచ్చు. లబ్ధిదారుల నుంచి కిలో రూ.పది, రూ.12కు రేషన్‌ బియ్యం కొనుగోలు చేసి, కిలో రూ.18 నుంచి రూ.20కు విక్రయిస్తూ భారీగా లాభాలు గడిస్తున్న పరిస్థితి నెలకొంది. రేషన్‌ బియ్యం మాఫియా వెనుక ఉన్న అసలు సూత్రధారులను పట్టుకుంటే తప్ప దీనికి అడ్డుకట్ట పడదు. రేషన్‌ బియ్యం కొనుగోలులో రేషన్‌ పంపిణీ వాహనాల పాత్ర ఉండటం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది.
నాణ్యత లేకపోవడమే పక్కదారికి ప్రధాన కారణం
ప్రభుత్వం రేషన్‌ దుకాణాల ద్వారా అందించే బియ్యం నాణ్యత లేకపోవడంతో తినేందుకు అనుకూలంగా ఉండటం లేదని లబ్ధిదారులు చెబుతున్నారు. కొంతమంది వేరే గత్యంతరం లేక రేషన్‌ బియ్యంతోనే కడుపు నింపుకుంటుండగా అనారోగ్య సమస్యలతో బాధపడే కొంతమంది లబ్ధిదారులు రేషన్‌ బియ్యాన్ని విక్రయిస్తున్నారు. చాలా మంది వృద్ధులు బిపి, సుగర్‌ వంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇలాంటి వారంతా రేషన్‌ బియ్యం తింటే ఇబ్బందికరంగా ఉంటుందని చెబుతున్నారు. ప్రభుత్వం నాణ్యమైన బియ్యం ఇస్తే ఎందుకు అమ్ముకుంటామని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. రేషన్‌ బియ్యం లబ్ధిదారులు తినడం లేదంటూ ప్రచారం చేసి నగదు బదిలీ వంటి ఆలోచనలను తెరపైకి తెస్తున్న పరిస్థితి సృష్టిస్తున్నారు. ప్రభుత్వం నాణ్యమైన సన్న బియ్యం అందించి రేషన్‌ బియ్యం దందాకు అడ్డుకట్ట వేయాల్సి ఉంది. అంతేకాకుండా రేషన్‌ బియ్యం దందాకు పాల్పడుతున్న సూత్రధారులపై కఠిన చర్యలు తీసుకోవాలని అంతా కోరుతున్నారు.