పడని వేలిముద్రలు
పట్టించుకోని అధికారులు
ప్రజాశక్తి - ముదినేపల్లి
మిషన్‌లో వృద్ధుల వేలిముద్రలు పడకపోవడంతో నెలల తరబడి వృద్ధుల కుటుంబాలకు రేషన్ బియ్యం ఇవ్వకపోవడంతో వారు పడరాని పాట్లు పడుతున్నారు. తమకు రేషన్ బియ్యం ఇవ్వాలంటూ అధికారులు, గ్రామ సచివాలయాలు చుట్టు తిరుగుతున్నారు. ముదినేపల్లికి చెందిన నిరుపేద అయిన అలసందలపల్లి నాగేశ్వరరావు (నాగులు)కు గతంలో అధికారులు అంత్యోదయ కార్డు (35కేజీల కార్డు) మంజారు చేశారు. దీంతో ప్రతినెల 35 కేజీల రేషన్ బియ్యం డీలర్‌వద్ద నుంచి నాగేశ్వరరావు తీసు కుంటున్నాడు. గత మూడు నెలలుగా వృద్ధ దంపతుల ఇద్దరి వేలిముద్రలు పడక పోవడంతో రేషన్ బియ్యం ఇవ్వడం ఆపేశారు. దీంతో వృద్ధ దంపతులకు బియ్యం ఇవ్వక తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. వృద్ధుడు నాగేశ్వరరావు తనకు బియ్యం ఇవ్వలేదంటూ గ్రామ సచివాలయం, గ్రామ రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా ఎవ్వరూ పట్టించుకున్న పాపాన పోలేదంటూ వృద్ధుడు ఆవేదన చెందుతున్నాడు. మండలంలోని వణుదురుకు చెందిన వృద్ధురాలు చిన్నం రాహేలమ్మ రెండు నెలలుగా బియ్యం ఇవ్వడంలేదు. అడిగితే వేలిముద్రలు పడడం లేదని చెబుతున్నారు. ఈ రీతిగా మండలంలోని అనేక గ్రామాల్లో వృద్దుల వేలిముద్రలు పడడంలేదంటూ రేషన్ ఇవ్వకపోవడంతో వృద్ధులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. వృద్ధుల వేలిముద్రలు పడని పక్షంలో గ్రామ వాలంటీర్ల ద్వారా రేషన్ ఇవ్వాల్సి ఉంది. అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడంతో వృద్ధులు ఆకలి బాధలతో అలమటిస్తున్నారు. ఈ విషయంపై ముదినేపల్లి గ్రామ విఆర్‌ఒ కరీంను వివరణ కోరగా తన దృష్టికి రాలేదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే వేలిముద్రలు పడని వృద్ధులకు బియ్యం ఇచ్చేవిధంగా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు.










