ప్రజాశక్తి-బాపట్ల జిల్లా: జిల్లాలోని కారంచేడు మండలం స్వర్ణ గ్రామంలో అధికార పార్టీ నేతల సారధ్యంలో ఉన్న రైసు మిల్లు ప్రభుత్వాధికారులకు సవాల్ విసురుతుంది. అధికారం అండగా ఈ మిల్లు కేంద్రంగా యథేచ్ఛగా సాగుతున్న రేషన్ బియ్యం అక్రమ దందాను నిలువరించడం అధికారులకు సాధ్యం కావడం లేదు. జిల్లాలోని రెవెన్యూ, విజిలెన్ ఎన్‌ఫోర్సుమెంట్ అధికారులు ఈ మిల్లులో జరుగుతున్న రేషన్ బియ్యం అక్రమదందాను అడ్డుకోలేక పోతున్నారు. అసలు అటు వైపు వెళ్లే సాహసం కూడా చెయ్యడం లేదు. దీంతో రాష్ట్ర స్థాయి అధికారులకు ఫిర్యాదులు చేరుతున్నా యి. వారు పక్క జిల్లాల అధికారులను దాడులకు పంపుతున్నారు. రెండు రోజుల క్రితం స్వర్ణ మిల్లుపై గంటూరు, కృష్ణా జిల్లాల నుంచి వచ్చిన విజిలెన్ ఎన్‌ఫోర్సుమెంట్ అధికారులు దాడులు జరిపారు. ఆ సమయంలో మిల్లు వద్ద ఉన్న అధికార పార్టీ నేత అనుచరులు అధికారులపై దాడి చేశారు. మిల్లులో ఉన్న అక్రమ రేషన్ బియ్యాన్ని ఒక అధికారి తన సెల్ ఫోన్‌లో చిత్రీకరిస్తున్న సమయంలో దాడి చేసి సెల్ పగులగొట్టారు. ఈ మేరకు కారంచేడు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయింది. కాగా జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ దందాలో ఆరితేరిన వారి మధ్య తలెత్తుతున్న విభేదాల కారణంగానే పక్కదారి పడుతున్న పేదల బియ్యం అరకొరగా అధికారులకు పట్టుబడుతుంది. జిల్లా అధికారులు ఈ రేషన్ బియ్యం అక్రమ రవాణా గురించి ఎన్ని సార్లు సమీక్షలు జరిపినా, హెచ్చరించినా రేషన్ బియ్యం పక్కదారి పడుతూనే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కార్డుదారులకు సరఫరా చేస్తున్న బియ్యం నాశిరకంగా ఉంటూ పేద, బలహీన వర్గాల వారు కూడా అన్నంగా వండుకుని తినేందుకు అనువుగా ఉండడం లేదని తెలుస్తుంది. అత్యధికులు దోశలు వేసుకునేందుకు మాత్రమే ఈ రేషన్ బియ్యాన్ని ఉపయోగిస్తున్నారు. మిగిలిన కార్డుదారులు తమకు వచ్చే బియ్యంకు సరిపడా వచ్చే నగదు తీసుకుని రేషన్ బియ్యాన్ని పంపిణీ కోసం వస్తున్న వాహనదారునికే ఇచ్చేస్తున్నారు. ఇలా మిగిలిన బియ్యం తిరిగి రేషన్ షాపులకు అక్కడ నుంచి మిల్లులకు రీసైక్లింగ్ కోసం వెళుతున్నాయి. ఇలా ప్రతి రేషన్ షాపుకు వస్తున్న బియ్యంలో 80 శాతం మిగిలిపోతున్నట్లు చెబుతున్నారు. ఇలా జిల్లా వ్యాప్తంగా మిగిలిపోతున్న వందల బస్తాల రేషన్ బియ్యం ప్రతి నెల అక్రమమార్గం పడుతుంది. ఇంత భారీ మొత్తంలో మిగులుతున్న రేషన్ బియ్యాన్ని సేకరించి మిల్లుల్లో రీసైకిలింగ్ చేసి అమ్ముకునే శక్తి అధికారం అండగా ఉన్నవారి వల్లనే అవుతుంది. దీంతో నియోజకవర్గాలు, ఏరియాల వారీగా అధికారం అండగా అక్రమార్కులు పుట్టుకొచ్చారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని స్వర్ణ రైసు మిల్లు ద్వారా అత్యధికంగా రేషన్ బియ్యం రీసైకిలింగ్ జరుగుతూ వచ్చింది. గతంలో పర్చూరు నియోజకర్గాన్ని రెండు, మూడు ఏరియాలుగా విభజించుకుని అధికార పార్టీ నేతలు రేషన్ బియ్యం అక్రమ దందా సాగిస్తూ వచ్చారు. కొంత కాలం క్రితం పర్చూరులో అధికార మార్పిడి జరిగిన నేపథ్యంలో ముఖ్యమైన ఆదాయ వనరుగా ఉన్న రేషన్ బియ్యం దందా మొత్తం స్వర్ణ రైసు మిల్లు కేంద్రంగానే జరగాలన్న నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. గతంలో ఇతర రైసు మిల్లుల వారు ఒకరిద్దరు కూడా రేషన్ బియ్యం రీసైక్లింగ్ అమ్మకాలు జరిపేవారని తెలుస్తోంది. కాని మొత్తం రేషన్ బియ్యం వ్యాపారం స్వర్ణ మిల్లు ద్వారానే జరపాలని ముఖ్యనేత నుంచి హుకుం జారీ అయినట్లు చెబుతున్నారు. అయితే చేస్తున్న దొంగ వ్యాపారంలో రేషన్ బియ్యం తాలూకు నగదు చెల్లింపులు సక్రమంగా జరగనందున అంతిమంగా డీలర్లు నష్టపోతున్నారు. రేషన్ షాపుల డీలర్లకు అక్రమార్కుల నుంచి రూ.లక్షల్లో బకాయిలు రావలసి ఉన్నట్లు చెబుతున్నారు. ఇలా పలు రకాలుగా ఇబ్బందులు పడుతున్న వారు తమ ప్రాంత నేతల ద్వారా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో ఇటీవలి కాలంలోనే నాలుగు పర్యాయాలు విజిలెన్స్ ఎన్‌ఫోర్సుమెంట్ అధికారులు స్వర్ణ మిల్లుపై దాడులు జరిపారు. చీరాల, పర్చూరు ప్రాంతాల్లో ఇటీవల వరుస దాడులు జరగడానికి కారణం బియ్యం అక్రమ వ్యాపారంలో ఉన్న వారి మధ్య తలెత్తిన విభేదాలే కారణమని తెలుస్తోంది. రేషన్ బియ్యం అక్రమ వ్యాపారంలో తమ ప్రత్యర్థులుగా ఉన్నవారు బియ్యం లోడ్ ఎత్తిన వెంటనే అధికారులకు ఈ విషయం చేరవేయడంతో వారు దారికాచి లారీల్లో వెళుతున్న బియ్యంను పట్టుకుంటున్నారు. అధికారులు కూడా తమకు సమాచారం వచ్చిన సందర్భాల్లో మాత్రమే నామమాత్రపు తనిఖీలు చేస్తున్నారు. ఈ సందర్భాల్లో కూడా అధికార పార్టీ నేతల నుంచి ఒత్తిడి వస్తే సాధారణ కేసులు పెట్టి, సరుకును తక్కువగా చూయిస్తున్నారు.
స్వర్ణ రైస్ మిల్లులో ఇప్పటికి నాలుగుసార్లు దాడులు
కారంచేడు మండలంలోని స్వర్ణ గ్రామంలో ఉన్న రైస్ మిల్లులో ఇటీవలి కాలంలో నాలుగుసార్లు విజిలెన్స్ అధికారులు దాడులు జరిపారు. వందల కొద్ది బస్తాల రేషన్ బియ్యం పట్టుబడింది. నామమాత్రపు కేసులతో మమ అనిపించారు. గత నెలలో జరిగిన దాడుల్లో కూడా దాదాపు 2 వేల బస్తాలకు పైగా అక్కడ రేషన్ బియ్యం పట్టుబడినట్లు తెలిసింది. కాని మిల్లులో అక్రమంగా నిలువ ఉంచిన 605 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అప్పట్లో అధికారులు తెలిపారు. అధికారం అండ ఉన్న స్వర్ణ లాంటి మిల్లుల్లో పగలు, రాత్రి అనే తేడా లేకుండా అక్రమ దందా సాగిస్తున్నారు. సోమవారం జరిపిన దాడుల్లో 810 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు విజిలెన్స్ అధికారులు తెలిపారు. రేషన్ బియ్యం అక్రమార్కులపై పీడి చట్టం ప్రయోగిస్తాం అని చెప్పడమే తప్ప ఎక్కడా అమలు కాలేదు. రేషన్ అక్రమార్కులపై సాధారణ కేసులు నమోదు కావడంతో సులభంగా కేసుల నుంచి బయటపడుతున్నారు. తిరిగి యథేచ్ఛగా పేదల బియ్యాన్ని అక్రమమార్గం పట్టించి సొమ్ము చేసుకుంటున్నారు.










