ప్రజశక్తి - చీరాల
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా పంపిణీ బియ్యంలో దుకాణదారులు అక్రమాలకు పాల్పడితే షాపు నిర్వాహకులు, దళారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్ఫోర్స్మెంట్ డిటి ఆర్ శరత్ అన్నారు. ప్రజా పంపిణీ బియ్యం ప్రజలకు పంపిణీ చేస్తున్న నేపథ్యంలో పట్టణంలోని పలు రేషన్ షాపులను శుక్రవారం తన సిబ్బందితో కలసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలోని 11, 12రేషన్ దుకాణాలు, పేరాలలోని 17, 9, 6రేషన్ దుకాణాలతో పాటు పలు దుకాణాలలో తనికీలు చేశామని అన్నారు. కొన్ని షాపులలో బియ్యం పంపిణీ పూర్తి అయ్యిందని, మరికొన్ని షాపులలో ఇంకా పంపిణీ చేయనప్పటికీ స్టాకు విషయంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని గుర్తించామన్నారు. షాపులకు సంబంధించిన పలు రికార్డులను ఆయన పరిశీలించారు. వీఆర్వోల ద్వారా వారి పరిధిలో ఉన్న రేషన్ షాపులపై ఎప్పటికప్పుడు ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశామని తెలిపారు. రేషన్ బియ్యం విషయంలో ఎలాంటి అక్రమాలు జరుగుతున్నట్లు స్థానికులు గుర్తిస్తే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు.










