May 04,2023 23:45

లబ్ధిదారులకు రేషన్‌ పంపిణీ చేస్తున్న అధికారులు!

తక్షణమే పట్టాం ఎండియు తొలగింపు
కార్డుదారులకు బియ్యం పంపిణీ
-'ప్రజాశక్తి' కథనానికి కదిలిన యంత్రాంగం
ప్రజాశక్తి -హుకుంపేట
: మండలంలోని పట్టం పంచాయతీ గంగూడి, బూరువలస గ్రామాల్లో రేషన్‌ బియ్యం పంపిణీపై రెవెన్యూ అధికారులు స్పందించారు. ప్రజాశక్తి వరుస కథనాలతో గ్రామాలకు తరలివచ్చి, క్షేత్రస్థాయిలో విచారణ జరిపి, కార్డుదారులకు బకాయి రేషన్‌ పంపిణీతోపాటు, బియ్యం పక్కదోవ పట్టించిన ఎండియును తొలగిస్తున్నట్లు ప్రకటించారు. రేషన్‌ సరుకులు పంపిణీలో అక్రమాలకు పాల్పడితే కఠినచర్యలు తప్పవని సంకేతాలిచ్చారు. గిరిజన సంఘం నేతలు వెలుగులోకి తెచ్చిన అక్రమాలపై వరుస కథనాలతో అధికారులను కదిలించిన ప్రజాశక్తి కృషిని గిరిజనం అభినందించి, కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. వివరాల్లోకి వెళితే...
మండలంలోని పట్టం పంచాయతీ గంగూడి, బూరువలస గ్రామాల్లో 14మంది నిరుపేద గిరిజన కార్డుదారులకు మార్చినెల రేషన్‌బియ్యం ఇవ్వకుండానే అనధికార కార్డుల్లో నమోదు చేసి, అక్రమాలకు పాల్పడిన వైనంపై బాధితుల ఆవేదనను, గిరిజన సంఘం నేతల ఆక్రోషాన్ని ప్రజాశక్తి దినపత్రిక వెలుగులోకి తెచ్చింది. దీంతో స్పందించిన అధికారులు గురువారం గంగూడి, బురువలస గ్రామాలను సందర్శించారు. సివిల్‌ సప్లరు డిప్యూటీ తహశీల్దార్‌ ఒ.ప్రశాంత్‌కుమార్‌ ఆధ్వర్యంలో రెవెన్యూ సిబ్బంది రేషన్‌ బాధితులతో మాట్లాడి, వివరాలు అడిగి తెలుసుకున్నారు.మార్చి కోటా బియ్యం ఇవ్వకుండా స్లిప్పుల్లో నమోదు చేశారని బాధితులు విన్నవించగా, దీనికి బాధ్యుడైన ఎండియును తొలగిస్తున్నట్లు సిఎస్‌డిటి వెల్లడించారు.అనంతరం రేషన్‌ అందలేదని ఆందోళన చేసిన 14 మందితోపాటు మార్చినెల రేషన్‌ బియ్యానికి నోచుకోని మరో ఆరుగురితో కలిపి 20 మందికి మార్చినెల కోటా బియ్యం 350 కిలోలను రెవెన్యూ సిబ్బంది దగ్గరుండి పంపిణీ చేశారు. తమ పోరాటానికి మద్దతుగా నిలిచిన గిరిజన సంఘం నేతలకు, ప్రజాశక్తికి బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా సిఎస్‌డిటి ప్రశాంత్‌ కుమార్‌ మాట్లాడుతూ, రేషన్‌ సరుకుల పంపిణీలో అక్రమాలకు పాల్పడితే కఠినచ ర్యలు తప్పవని హెచ్చరించారు. తాత్కాలిక స్లిప్పుల ద్వారా కాకుండా ఈపాస్‌లో కార్డుదారుల వివరాలను నమోదు చేసి రేషన్‌ పంపిణీ చేయాలని సూచించారు. రేషన్‌ అక్రమాలపై నేరుగా తమను సంప్రదించాలని ఫోను నెంబరు ఇచ్చారు. తన పరిధిలోని 50 కుటుంబాలకు దగ్గరుండి సక్రమంగా రేషన్‌ సరుకులు అందించే బాధ్యతను ఇకనుంచి గ్రామ వాలంటీర్లు తీసుకోవాలని సూచించారు. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే సంబంధిత ఎండియు, డీలరుతోపాటు వాలంటీర్లు బాధ్యులౌతారని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంఆర్‌ఐ జి.రంగారావు, విఆర్‌ఒ డి.కొండబాబు, స్థానిక సర్పంచ్‌ కించాయి కృష్ణ, రెవెన్యూ సిబ్బంది, లబ్ధిదారులు, అప్పారావు, నూకరాజు, చిన్నయ్య, సుబ్బారావు, బాలన్న. పాల్గొన్నారు