
ప్రజాశక్తి-సత్తెనపల్లి : విజయవాడలో బుధవారం నిర్వహించే సిపిఎం ప్రజారక్షణ భేరి బహిరంగ సభను జయప్రదం చేయాలని ఆ పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు దీపావళి సందర్భంగా స్థానిక సిపిఎం కార్యాలయం ఆవరణలో ఆదివారం రాత్రి ప్రజారక్షణ భేరి బహిరంగ సభను జయప్రదం చేయాలని పూలతో అలంకరించి దీపాలు వెలిగించారు. ఈ సందర్భంగా సిపిఎం పట్టణ, మండల కార్యదర్శులు కార్యదర్శి డి.విమల, పి.మహేష్, నాయకులు జి.ఉమశ్రీ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లి ఎండగట్టేందుకు సిపిఎం రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రలు, పాదయాత్రలు నిర్వహించిందని చెప్పారు. కేంద్రంలోని మోడి ఆడించినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్‌రెడ్డి ఆడుతున్నారని, ఆస్తి పన్ను, చెత్త పన్ను విపరీతంగా పెంచారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను తెగనమ్మి కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతోందని, విశాఖ ఉక్కును జిందాల్ కంపెనీకి కట్టబెట్ట పూనుకుందని అన్నారు. కొత్త పరిశ్రమలు రాకపోగా ఉన్న పరిశ్రమలను ప్రైవేటీకరించడంతో నిరుద్యోగ సమస్య మరింత తీవ్రమవుతుందని, చదువు పూర్తయిన వారికి ఉద్యోగాలు రాక వారి పరిస్థితి అగమ్య గోచరంగా ఉందన్నారు. ఈ విధానాలన పై రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్ష పార్టీలు వైసిపి, టిడిపి, జనసేన పార్టీలు ఒక్క మాట కూడా మాట్లాడకపోగా బిజెపికి వంత పాడుతున్నాయని దుయ్యబట్టారు. ఈ నేపథ్యంలో సిపిఎం నిర్వహించే పోరాటాల్లో ప్రజలంతా భాగస్వామ్యం కావాలని కోరారు.
ప్రజాశక్తి - మాచవరం : సభ జయప్రదం కోసం స్థానిక సిపిఎం కార్యాలయంలో పోస్టర్‌ను ఆవిష్కరించారు. సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఏపూరి గోపాలరావు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పాలనలో దేశం అస్తవ్యస్తంగా తయారైందని, బిజెపి రాష్ట్రాల్లో మైనార్టీలకు భద్రత లేకుండా పోయిందని చెప్పారు. రాష్ట్రానికి ఇచ్చిన విభజన హామీలను విస్మరించి తీవ్ర అన్యాయం చేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ ఆసుపత్రులు నామమాత్రంగా తయారయ్యాయని, కార్పొరేటర్ ఆస్పత్రుల దోపిడికి సామాన్యుడు బలైపోతున్నారని అన్నారు. విద్యుత్ ఛార్జీలు నిత్యవసర ధరల పెంచి సామాన్యుడిపై మోయలేని భారాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపితో జనసేన జతకట్టడం ద్వారా ఆ పార్టీ కూడా రాష్ట్రానికి ద్రోహం చేస్తోందని విమర్శిం చారు. చంద్రబాబు నాయుడు విద్యుత్ చార్జీలు పెంచినప్పుడు పోరాడి తిప్పికొ ట్టామని, అదే తరహా పోరాటాలకు ప్రజలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్ర మంలో సిపిఎం నాయకులు ఎలిశెట్టి బ్రహ్మ నాయుడు, సైదా, బుల్లబ్బాయి పాల్గొన్నారు.
ప్రజాశక్తి - అమరావతి : పంటలకు మద్దతు ధరలు దక్కక రైతులు, నిత్యావసరాల ధరలు పెరిగి సామాన్యులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జి.రవిబాబు అన్నారు. విజయవాడలో బుధవారం నిర్వహించే సిపిఎం ప్రజారక్షణ భేరి బహిరంగ సభ జయప్రదం కోసం మండలంలోని నరుకుళ్లపాడు, అమరావతి, ఎండ్రాయి, లేమల్లె, ఉంగుటూరు, కర్లపూడి, శావపాడు, పెద్దమద్దూరు తదితర గ్రామాల్లో ప్రచారం చేపట్టారు. రవిబాబు మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చాక సామాన్యుల బతుకు భారమైందని, ప్రజలను విస్మరించి కార్పొరేట్లకు అనుకూలంగా విధానాలు అమలు చేస్తున్నారని విమర్శించారు. దీనికితోడు ప్రజల్లో కుల, మత చిచ్చు పెడుతున్నారని, అయితే బిజెపి విధానాలకు రాష్ట్రంలోని వైసిపి, టిడిపి, జనసేన వత్తాసు పలుకుతున్నాయని, ఈ కుట్రలను ప్రజలంతా ఐక్యంగా తిప్పికొట్టాలని కోరారు. ప్రత్యామ్నాయ రాజకీయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి సిపిఎం చేస్తున్న కృషిలో కలిసి రావాలన్నారు. ఇందులో భాగంగా విజయవాడ సభకు తరలిరావాలని పిలుపునిచ్చారు. సిపిఎం మండల కార్యదర్శి బి.సూరిబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్న జగనన్న ఇళ్ల నిర్మాణం ఎక్కడ వేసిన గోంగడి అక్కడే అన్నట్లుగా ఉందని విమర్శించారు. అమరావతిలోని జగనన్న కాలనీలో వెయ్యి కుటుంబాలపైగా స్థలాలిచ్చినా 20లోపే ఇళ్లు పూర్తయినట్లు తెలిపారు. లే అవుట్‌లో మౌలిక సౌకర్యాలైన వీధిలైట్లు, రహదారి, తాగునీరు లేవని చెప్పారు. ఇంటి నిర్మాణానికి ఇస్తున్న రూ.1,80,000 చాలక లబ్ధిదార్లు అప్పుల పాలవుతున్నారని, కనీసం రూ.5 లక్షలైనా ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పైగా అమరావతిలోని జగనన్న కాలనీ కృష్ణానది ముంపు ప్రాంతమని, ఇక్కడ ఇవ్వడం అంటే పేదలను చిన్నచూపు చూడడమే అని విమర్శించారు. కార్యక్రమంలో నాయకులు నండూరి వెంకటేశ్వరరాజు పాల్గొన్నారు.