Oct 31,2023 23:49

ఏర్పాట్లను పరిశీలిస్తున్న కలెక్టర్‌, సిపి తదితరులు

ప్రజాశక్తి- ఎంవిపి కాలనీ : విశాఖపట్నంలో జరగనున్న ఇంటర్నేషనల్‌ కమిషన్‌ అండ్‌ ఇరిగేషన్‌ డ్రైనేజ్‌ (ఐసిఐడి) 25వ కాంగ్రెస్‌ సమావేశాల ప్రారంభోత్సవానికి ఈ నెల 2వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి విశాఖపట్నం రానున్నారని ముఖ్యమంత్రి అదనపు వ్యక్తిగత కార్యదర్శి కె.నాగేశ్వర్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి ఉదయం 8:05 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి 8:50 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌ ద్వారా మధురవాడలోని ఐటి హిల్‌ నెంబర్‌ 3కి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో 9:30 గంటలకు రుషికొండ వద్ద ఉన్న రాడిసన్‌ బ్లూ రిసార్ట్‌కు చేరుకుంటారు. అనంతరం 9:30 నుండి 11:00 వరకు ఇంటర్నేషనల్‌ కమిషన్‌ అండ్‌ ఇరిగేషన్‌ డ్రైనేజ్‌ (ఐసిఐడి) 25వ కాంగ్రెస్‌ సమావేశాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమం అనంతరం 11:45 గంటలకు ప్రత్యేక విమానంలో విశాఖపట్నం నుంచి బయలుదేరి 12:30 గంటలకు విజయవాడ చేరుకుంటారు.
ఏర్పాట్లు పరిశీలన
జిల్లాలో ఈ నెల 2వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి పర్యటనను విజయవంతంచేయాలని, అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున జిల్లా అధికారులను ఆదేశించారు. ర్యాడిసన్‌ బ్లూ హోటల్‌లో నిర్వహించనున్న 25వ కాంగ్రెస్‌, 74వ కార్యనిర్వాహక సమావేశాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరుకానున్న నేపధ్యంలో మంగళవారం జిల్లా కలెక్టర్‌, పోలీస్‌ కమిషనర్‌ ఎ.రవిశంకర్‌, జివిఎంసి కమిషనర్‌ సిఎం.సాయికాంత్‌ వర్మలతో కలిసి ర్యాడిసన్‌ బ్లూ హోటల్‌ను సందర్శించి, సమావేశ ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జలవనరుల శాఖ కార్యనిర్వహక ఇంజినీర్‌ ఉమేష్‌ కుమార్‌, భీమిలి రెవిన్యూ డివిజనల్‌ అధికారి భాస్కర్‌రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ పి.జగదీశ్వరరావు పాల్గొన్నారు.