Nov 06,2023 00:42

విలేకర్లతో మాట్లాడుతున్న గుంటూరు విజరుకుమార్‌

ప్రజాశక్తి - సత్తెనపల్లి టౌన్‌ : సిపిఎం ఆధ్వర్యంలో ఈ నెల 7వ తేదీన సత్తెనపల్లి పట్టణంలోని తాలూకా సెంటర్లో నిర్వహించే ప్రజారక్షణ భేరి సభను జయప్రదం చేయాలని ఆ పార్టీ పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజరుకుమార్‌ కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ప్రచార జాతా పల్నాడు జిల్లాకు మంగళవారం వస్తుందని చెప్పారు. ఈ మేరకు స్థానిక సిపిఎం కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, కడప ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు, రామాయపట్నం పోర్ట్‌ పనులు, రాజధాని నిర్మాణం, రైల్వే జోన్‌ తదితర విభజనా హామీల్లో ఏ ఒక్కటీ కేంద్ర ప్రభుత్వం నెరవేర్చలేదని, రాష్ట్రాన్ని నిలువునా మోసం చేసిందని, పైగా విశాఖ ఉక్కును తెగనమ్మటానికి సిద్ధమైందని విమర్శించారు. తామేమి తక్కువ తినలేదు అన్నట్లు రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం ఆరాచాక పాలన సాగిస్తోందన్నారు. ముఖ్యమంత్రి కేవలం కార్పొరేట్‌ సేవలో తరిస్తున్నారని చెప్పారు. ప్రజా సమస్యలను గాలికొదిలేశారని, విద్యుత్‌, పన్నుల భారం మోపారని అన్నారు. పంటలను కాపాడుకోవడానికి రైతులు వేల రూపాలు ఖర్చుచేసి దూరాబారం నుండి నీరు పెట్టుకుంటున్నారని, జల పథకం క్రింద రైతులకు ఉచిత బోర్లు వేస్తామని చెప్పిన ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. పొలాలన్నీ సాగవ్వని కారణంగా గ్రామాల్లో కూలి పనులు తగ్గాయని, ఉపాధి హామీ పనులైనా కల్పించడం లేదని అన్నారు. మరోవైపు ధరలు, విద్యుల్‌ ఛార్జీలు, పన్నులు పెంచి చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. ఈ విధానాలన్నింటిపైనా సిపిఎం పోరాడుతోందని, అందులో భాగంగా నిర్వహించే బస్సు యాత్రను, బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో సిపిఎం పట్టణ, మండల కార్యదర్శులు డి.విమల, పి.మహేష్‌, నాయకులు వి.తులసిరామ్‌, జె.రాజ్‌కుమార్‌ పాల్గొన్నారు.