ప్రజాశక్తి -అనకాపల్లిప్రతినిధి:రాయలసీమ ప్రాంతంలోని బోయ/వాల్మీకిలను ఎస్‌టి జాబితాలో చేరుస్తూ ఈ నెల 24న శాసనసభలో చేసిన తీర్మానంపై ఆదివాసీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీస ప్రమాణాలు పాటించకుండా ప్రభుత్వం తీసుకున్న ఏకపక్ష నిర్ణయంపై గిరిజన సంఘం శుక్రవారం మన్యం బంద్‌కు పిలుపునిచ్చింది. ఇప్పటికే బంద్ జయప్రదానికి ఏజెన్సీ అంతటా విస్తృత ప్రచారం జరుగుతోంది. మరోవైపు ప్రభుత్వ నిర్ణయంపై గ్రామాల్లోనూ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీని నెరవేర్చడం కోసం బోయ/వాల్మీకిలను ఎస్‌టి జాబితాలో చేర్చాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపుతున్నామన్న ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి.. రద్దు చేసిన జిఒ 3 పునరుద్ధరణను మాత్రం రెండున్నరేళ్లుగా ఎందుకు పట్టించుకోవడం లేదని గిరిజనులు ప్రశ్నిస్తున్నారు. గిరిజన యువతకు ఉద్యోగ నియామకాల్లో నూరు శాతం రిజర్వేషన్ కల్పించిన జిఒ 3కు చట్టబద్ధత కల్పించడంలో ప్రభుత్వం తగిన శ్రద్ధ తీసుకోలేదన్న విమర్శలున్నాయి.
ప్రమాణాల పాటింపేదీ ?
రాయలసీమ ప్రాంతంలోని బిసి - ఎలో ఉన్న బోయ/వాల్మీకిలను ఎస్‌టి హోదాలో చేర్చాలని తీర్మానం చేయడానికి ప్రభుత్వం కొన్ని ప్రమాణాలు పాటించాల్సివుంది. ఒక తెగనుకానీ, సమూహాలనుగానీ షెడ్యూల్ తెగలుగా గుర్తించేందుకు లోకూర్ కమిటీ కొన్ని ప్రమాణాలను నిర్దేశించింది. ఆ ప్రకారం.. ఆహార సేకరణ, పోడు వ్యవసాయం, ప్రత్యేక సంస్కృతి, సంప్రదాయాలు, భాష, ఆచార వ్యవహారాలు, విశ్వాసాలు, కళలు, ప్రత్యేక నివాసిత ప్రాంతం, విద్య, ఆరోగ్యం, ఆదాయం, వెనుకబాటుతనం వంటివన్నీ పరిగణనలోకి తీసుకోవాలి. కానీ ప్రభుత్వం ఇవేవీ పట్టించుకోలేదు. రిటైర్డ్ ఐఎఎస్ అధికారి శామ్యూల్ ఆనందకుమార్ సిఫార్సుల ప్రకారం తీర్మానం చేసింది తప్ప, తెగను గుర్తించేందుకు లోకూర్ కమిటీ చేసిన సిఫార్సులను గాలికొదిలేసింది. ప్రభుత్వం తనకు నచ్చిన వ్యక్తితో ఏకసభ్య కమిషన్‌ను నియమించి, ఆయనిచ్చిన నివేదిక ఆధారంగా తీర్మానం చేయడానికి వీల్లేదని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం బిసికి చెందిన బోయ/వాల్మీకిలకు గిరిజన తెగ లక్షణాలున్నాయని గిరిజన సంస్కృతి, పరిశోధన సంస్థ ఎటువంటి సిఫార్సూ చేయలేదు. కనీసం పరిశోధన సంస్థను ప్రభుత్వం సంప్రదించలేదు. కనీసం ఆ సంస్థ నుంచి ఏ సమాచారమూ, సూచననూ తీసుకోనూలేదు. ఆంత్రోపాలాజికల్ సర్వే నిర్వహించకుండా ఇచ్చిన నివేదికకు విలువవుండదని పలువురు అంటున్నారు. గిరిజన తెగకు చెందినవారన్న ప్రాథమిక ఆధారాలేవీ బోయ/వాల్మీకిలకు లేనప్పటికీ ఎస్‌టి జాబితాలో చేర్చాలని తీర్మానం చేయడం విమర్శలకు తావిస్తోంది. దీనిపై గిరిజన సలహా మండలి తీర్మానం కూడా లేదు. బోయ/వాల్మీకిలను ఎస్‌టి జాబితాలో చేర్చాలని తీర్మానం చేయడంపై పాడేరు, అరకు ఎమ్మెల్యేలు భాగ్యలక్ష్మి, ఫాల్గుణ, ఎంపీ మాధవి అభ్యంతరం చెప్పకపోవడంపై గిరిజనులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. రాజశేఖరరెడ్డి, చంద్రబాబు ప్రభుత్వాలు బోయ/వాల్మీకిలను ఎస్‌టి జాబితాలో చేర్చాలని ప్రయత్నించి, గిరిజనుల వ్యతిరేకతతో వెనక్కుతగ్గారు. గిరిజనుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పటికీ ఈ ప్రభుత్వం తీర్మానం చేసి ఆదివాసీలపై దాడికి దిగింది. దీంతో ఏజెన్సీ అంతటా ఆగ్రహం వ్యక్తమవుతోంది.










