Jul 16,2023 01:36
విజయనగర కాలనీలోని రుధిర క్షేత్రం వద్ద మాట్లాడుతున్న గ్రామపెద్దలు

ప్రజాశక్తి-చీరాల: 1985 జూలై 17న కారంచేడులో జరిగిన దారుణ మారణకాండకు నేటితో 38 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా స్థానిక విజయనగర్‌ కాలనీ సమీపంలో ఉన్న కారంచేడు మృతవీరుల రుధిరక్షేత్రం వద్ద జులై 17న ఉదయం 10 గంటలకు జరుగనున్న సంస్మరణ సభను జయప్రదం చేయాలని విజయనగర కాలనీ గ్రామపెద్దలు అన్నారు. శనివారం రుధిర క్షేత్రం వద్ద జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. 1985 జూలై 17న అగ్రవర్ణ భూస్వాములు కారంచేడు మాదిగపల్లెపై పడి అతి దారుణంగా వెంటాడి వేటాడి ఆరుగురిని చంపి 48 మందిని గాయాలపాలు చేశారన్నారు. తన కుమారుడిని కళ్లముందే చంపటం చూసిన ప్రధాన సాక్షి దుడ్డు ఆలీసమ్మను కిరాతకంగా చంపారని అన్నారు. న్యాయస్థానాల్లో నిందితులకు శిక్షలు పడాలని 24 సంవత్సరాలు పోరాటం చేసి అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టులో దోషులకు శిక్షలు పడేవరకూ నిబద్ధతతో కారంచేడు బాధితులు పోరాడారని అన్నారు. బాధితుల పక్షాన పోరాడిన ఆనాటి కారంచేడు ఉద్యమంలో పనిచేసిన నాయకులు, మేధావులు, కార్యకర్తలు అందరూ 38వ కారంచేడు మృతవీరుల సంస్మరణ సభకు విచ్చేసి మృతవీరులకు ఘన నివాళి అర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో దుడ్డు భాస్కరరావు, తేళ్ల వెంకటస్వామి, తేళ్ల సుబ్బారావు, బుడంగుంట్ల లక్ష్మీ నరసయ్య, సిర్ర భగత్‌సింగ్‌, గొర్రెపాటి రవి, దుడ్డు వెంకటేశ్వర్లు, బొంత అంకయ్య, గ్రామపెద్దలు తేళ్ల లక్ష్మీ ప్రసాద్‌, తేళ్ల దేవదానం, తేళ్ల ప్రసాద్‌, దుడ్డు ఏసుపాదం తదితరులు పాల్గొన్నారు.