Aug 25,2023 23:31
ఆహ్వాన పత్రాలు అందజేస్తున్న ముస్లిం నాయకులు

ప్రజాశక్తి-బాపట్ల: ముస్లిం ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఐక్యతా సమావేశం ఈ నెల 27వ తేదీ ఆదివారం గుంటూరు బి కన్వెన్షన్‌ సెంటర్లో నిర్వహిస్తున్నట్లు ముస్లిం ఐక్యవేదిక బాపట్ల జిల్లా అధ్యక్షులు మౌలాబేగ్‌ తెలిపారు. శుక్రవారం ఆహ్వాన పత్రాల పంపిణీ సందర్భంగా ఆయన బాపట్లలో విలేకరులతో మాట్లాడారు. మౌలా బేగ్‌ మాట్లాడుతూ రాష్ట్రంలోని ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వివిధ పార్టీల రాజకీయ నాయకులు, మాజీ, ప్రస్తుత మంత్రులు, ఎమ్మెల్యేలు, చైర్మన్లు, మేధావులు, సంఘ సేవకులు, డాక్టర్లు, లాయర్లు, వివిధ అసోసియేషన్‌ పెద్దలు, వివిధ ముస్లిం ఆర్గనైజేషన్‌ పెద్దలు, వులేమాలు, కుల సంఘాల పెద్దలు ఈ సమావేశంలో పాల్గొంటారన్నారు. జనాభా దామాషా ప్రకారం చట్టసభల్లో ముస్లింలకు ప్రాధాన్యత కల్పించాలని, 15 ఎమ్మెల్యే, 4 ఎంపీ సీట్లు కేటాయించాలని, ఎస్సీ ఎస్టీ తరహాలో ముస్లిములకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని, చట్ట సభల్లో కేంద్ర ప్రభుత్వం ముస్లిం మైనారిటీలకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టే నల్ల చట్టాల బిల్లులకు వ్యతిరేకంగా ఓటు వేయాలని ఆయన కోరారు. వక్ఫ్‌ బోర్డు ప్రక్షాళన, వక్ఫ్‌ ఆస్తుల పరిరక్షణకు చర్యలు చేపట్టాలని, అన్యాక్రాంతమైన ఆస్తులను స్వాధీనపరచుకోవాలని అన్నారు. మైనారిటీ సబ్‌ ప్లాన్‌ను వెంటనే అమలు చేయాలని, ఇస్లామిక్‌ బ్యాంకు ఏర్పాటు చేసి వడ్డీ రహిత రుణాలు మంజూరు చేయాలని కోరారు. ముస్లిం విద్యార్థుల కోసం మోడరన్‌ ఉర్దూ యూనివర్సిటీతో పాటు ప్రతి మండలంలో మోడరన్‌ ఉర్దూ స్కూల్‌ జిల్లాకో కళాశాల ఏర్పాటు చేసి ఉర్దూ భాషాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలని అన్నారు. ప్రతి నియోజకవర్గానికి ఒక షాదిఖానా నిర్మించాలన్నారు. ఆహ్వాన పత్రాల పంపిణీ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గౌస్‌ బాషా, గౌరవ అధ్యక్షులు జిలాని, ముస్లిం ఐక్యవేదిక బాపట్ల నియోజకవర్గ అధ్యక్షులు తాజుద్దీన్‌, సయ్యద్‌ పీర్‌ పాల్గొన్నారు.