Aug 08,2023 22:27

మాట్లాడుతున్న కూన రవికుమార్‌

* వంశధార రిజర్వాయర్‌ పరిశీలన
* కొత్తూరులో బహిరంగ సభ
* ప్రాజెక్టుల పూర్తిపై ప్రభుత్వ నిర్లక్ష్యం
* టిడిపి జిల్లా అధ్యక్షులు కూన రవికుమార్‌
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్‌, ఆమదాలవలస: 
సాగునీటి ప్రాజెక్టుల పరిశీలనలో భాగంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఈనెల పదో తేదీన జిల్లాకు రానున్నారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు కూన రవికుమార్‌ వెల్లడించారు. శ్రీకాకుళం, ఆమదాలవలసలోని టిడిపి కార్యాలయాల్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశాల్లో ఆయన మాట్లాడారు. బూర్జ మండలం పాలవలసకు ఉదయం పది గంటలకు చేరుకుంటారని, అక్కడ ఆయనకు స్వాగతం పలకనున్నట్లు తెలిపారు. పాలవలస నుంచి మదనాపురం మీదుగా చిగురువలస వద్ద వంశధార-నాగావళి అనుసంధానం కాలువ, హిరమండలంలో వంశధార రిజర్వాయర్‌ను పరిశీలిస్తారని తెలిపారు. హిరమండలంలో నిర్వాసిత రైతులతో సమావేశ అనంతరం కొత్తూరులో బహిరంగ సభలో ప్రసంగిస్తారని వివరించారు. చంద్రబాబు పర్యటనను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
వైసిపి ప్రభుత్వం నాలుగేళ్లలో రాష్ట్రాన్ని అధోగతి పాల్జేసిందని విమర్శించారు. సాగునీటి ప్రాజెక్టులను పట్టించుకోకపోవడంతో రైతాంగానికి పూర్తిస్థాయిలో సాగునీరందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన టిడిపి ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ.62 వేల కోట్లు ఖర్చు చేసి, దాదాపుగా పూర్తయ్యే దశకు తీసుకొచ్చామన్నారు. గత నాలుగేళ్లలో వైసిపి ప్రభుత్వం రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో ఎక్కడా పనులు చేపట్టకుండా కాలయాపన చేసిందని విమర్శించారు. మరోవైపు ప్రాజెక్టుల కోసం రూ.22 వేల కోట్లు ఖర్చు చేసినట్లు లెక్కలు చూపిస్తోందన్నారు. నాగావళి-వంశధార నదుల అనుసంధానానికి టిడిపి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, పనులు ప్రారంభ దశలో ఉండగానే వైసిపి ప్రభుత్వం వాటిని ఆపేసిందని విమర్శించారు. చివరి దశలో ఉన్న వంశధార ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయకుండా ఇప్పుడు ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తామంటూ కొత్త పల్లవి అందుకుందన్నారు. టిడిపి హయాంలో వంశధార ప్రాజెక్టు కోసం రూ.954 కోట్లు ఖర్చు చేస్తే, ఈ ప్రభుత్వ హయాంలో జిల్లాలో ఇద్దరు మంత్రులు, స్పీకర్‌ ఉన్నా ప్రాజెక్టును పూర్తి చేసేందుకు నిధులు ఎందుకు తెచ్చుకోలేకపోయారని ప్రశ్నించారు. కమీషన్ల కోసమే ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్‌ను పూర్తి చేయడం లేదని ఆరోపించారు. సమావేశంలో టిడిపి జిల్లా ఉపాద్యక్షులు పి.ఎం.జె బాబు తదితరులు పాల్గొన్నారు.