ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : దళితుల సామాజిక న్యాయం కోసం విజయవాడలో శుక్రవారం నిర్వహించే మహాధర్నాకు పెద్దఎత్తున తరాలి రావాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) పల్నాడు జిల్లా కార్యదర్శి జి.రవిబాబు కోరారు. ఈ మేరకు బుధవారం నరసరావుపేట మండలం దొండపాడు, పెద్దరెడ్డిపాలెం, ములకలూరు, పాలపాడు గ్రామాల్లో పట్టణంలోని కంభంపాలెంలో కరపత్రాలు పంపిణీతో ప్రచారం చేశారు. రవిబాబు మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో, రాష్ట్రంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. దళితులకు రక్షణగా ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి చట్టాన్ని నీరుగార్చే కుట్రలు చేస్తున్నారని చెప్పారు. అట్రాసిటీ కేసులో నిందితులకు స్టేషన్ బెయిలు ఇవ్వటం అన్యాయమన్నారు. ఎస్సీలకు ఉచిత గృహ విద్యుత్ 300 యూనిట్లకు పెంచాలని, పాత బకాయిలు రద్దు చేయాలని, డప్పు, చర్మకారులకు ఇస్తున్న పెన్షన్ రూ.5 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. ప్రతి ఎస్సీ కాలనీకి శ్మశాన స్థలాన్ని కేటాయించాలని, సబ్ ప్లాన్ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని కోరారు. సాగునీరు రాక, దళిత మహిళా కూలీలు పనులు లేక ఇబ్బందులు పడుతున్నారని, ఉపాధి హామీ పనులు కల్పిం చాలని అన్నారు. ఈ అంశాలపై నిర్వహించే ధర్నాకు అంద రూ తరలిరావాలన్నారు. కార్యక్రమంలో నాయకులు ఎం.ఆం జనేయులు, విద్యాసాగర్, నవీన్ నాగేశ్వరరావు పాల్గొన్నారు.










