ఉదయాన్నే వార్తా పత్రిక
మరణాల రేటుని ముద్రించుకొని
వాకిటిపై వాలింది
చూసీ చూడగానే
నా కళ్ళు చురకత్తులయ్యాయి
టీవీలో అబద్దాల
వార్తల వర్షం కురుస్తోంది
తడవలేక తల్లడిల్లక
మా ఆవిడ చేసే వంట పనిలో
సాయం చెయ్యిగా మారాను
గల్లీలో గుంపులు, గుంపులుగా
జనాలు గాలి మాటల్ని
ఒకరికి, ఒకరు విసురుకుంటున్నారు
బహుశా వారికి
సామాజిక బాధ్యత లేదేమో ?
సూరీడు నెత్తికెక్కినా
ఛారుతో సొల్లు కబుర్లను రుద్దుతూ
రోడ్లమీదనే రాజకీయ బురదను
పూసుకుంటూ ఇంగితజ్ఞానం
ఇసుమంత లేక
ఇల్లును మరచారు ?
రోడ్లు మౌనాన్ని పూనాలి
ఒకరికి, ఒకరు
స్వీయ నిర్బంధంలోకి వెళ్ళాలి
సమూహాల తాకిడిని తుంచాలి
ముందు భయాల్ని అంతమొందించాలి
పిచ్చుకల్లే ఆత్మ విశ్వాసపు గూడును
గదిలోనే గుప్తంగా నిర్మించుకోవాలి
మనిషి రేపటి ఆశల్ని ఊపిరి చేసి
ధైర్యంతో ముందుకు
కొంగొత్తగా సాగి
రేపటి స్వప్నాలకు దారుల్ని పరచాలి...!!
- మహబూబ్ బాషా చిల్లెం 95020 00415