ఆశను మొలకెత్తించి
పిలకలు తొడిగేదాకా
అలా ... నిర్లక్ష్యపు ఎండలో వదిలేయకు
పిలక చివర పిందులు
ఒడలిపోయి నిన్ను
నేరస్తుడిలా చూస్తుంటాయి!
అప్పుడు నిన్ను నిన్నెలా శిక్షించుకుంటావు?
మనసోమూల నుంచి
హెచ్చరిస్తున్నా పట్టించుకోకపోతే
నీ మూతి దగ్గర మెతుకులు
నీ వేళ్ళతోనే నీపై
యుద్ధం ప్రకటించడమూ చూస్తావ్!
అప్పుడు స్వార్థమో, ఇంకోటో
అడ్డుపెట్టుకుని ఏదోలా మింగేస్తావ్
సహజమే అనే భ్రమలో
మరో రోజుకు గేలం వేస్తావ్
ఆ మరుసటి రోజు ఇంకా హీనమౌతుంది
నీ పేగులు ఆకలితో
తిరుగుబాటు లేవదీస్తారు,
మనసు వేపు నిలబడి!
ఇన్ని సందర్భాలు
నిన్ను ఒంటరిని చేస్తాయి
నీ ఊహకందని చోట
నీ అంతిమ ఊపిరిపై రాజ్యాన్ని స్థాపిస్తారు!
నువ్వేం చేయలేవు... చేయనే లేవు
అందుకే... ఆశ మొలకెత్తినప్పుడే
ఆశయానికి ఆత్మస్థైర్యపు ఎరువు వేస్తే
విపత్తులను జయించడానికి
ఆయుధపు ఫలాలు కాస్తారు...
అప్పుడిక రేపటి రోజులన్నీ మనవే!
- కొత్తపల్లి మణీ త్రినాథరాజు
99493 89296