Oct 02,2023 00:27

సమావేశంలో మాట్లాడుతున్న నాయకులు

ప్రజాశక్తి-గుంటూరు : సాధారణ బీమా పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై దేశవ్యాప్త పిలుపులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం నుండి ఆందోళనలు చేపడుతున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ సాధారణ బీమా పెన్షనర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు పి.వి.సుబ్బారావు తెలిపారు. ఆదివారం స్థానిక అమరావతి రోడ్డు, నవీన పాఠశాల సమావేశం మందిరంలో సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశానికి జనరల్‌ ఎంప్లాయిస్‌ పెన్షనర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర చైర్మన్‌ అంకయ్య అధ్యక్షత వహించగా పివి సుబ్బారావు మాట్లాడారు. జనరల్‌ ఇన్సూరెన్స్‌ పెన్షనర్స్‌ అసోసియేషన్‌ పట్ల కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ తీవ్ర వివక్ష చూపుతోందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, బ్యాంకింగ్‌, ఎల్‌ఐసి తదితర ఆర్థిక సంస్థల ఉద్యోగులకు ఆఖరి నెల జీతంలో 30 శాతం ఫ్యామిలీ పెన్షన్‌గా అందచేస్తున్న కేంద్ర ఆర్థిక శాఖ సాధారణ బీమా ఉద్యోగులకు 15 శాతమే అనుమతించి అన్యాయం చేస్తోందని విమర్శించారు. ప్రతి ఐదేళ్లకు కేంద్ర ప్రభుత్వ బ్యాంకింగ్‌ ఎల్‌ఐసి తదితర ఉద్యోగుల వేతన సవరణ జరిగినట్లు పెన్షనర్లకు కూడా పెన్షన్‌ అప్డేషన్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. తమ డిమాండ్ల సాధనకు రాష్ట్ర, జాతీయ స్థాయిలలో ఆందోళన కార్యక్రమాలు దశల వారీగా ఉద్యమ కార్యాచరణ రూపొందించుకున్నట్లు వివరిం చారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోలమన్‌రాజు, అమరావతి యూనిట్‌ కార్యదర్శి ఎం.సాంబశివరావు, కోశాధికారి కృష్ణారావు, రాష్ట్ర నలుమూలల నుండి వివిధ జిల్లాల నాయకులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.