
ప్రజాశక్తి-విజయవాడ అర్బన్: ఈ నెల 21, 22, 23 తేదీల్లో క్రెడారు 9వ ప్రాపర్టీ షో జరగనుంది. విజయవాడలోని ఎ కన్వెన్షన్ సెంటర్‌లో నందు ఈ ప్రాపర్టీ షోను నిర్వహిస్తున్నారు. క్రెడారు ప్రాపర్టీ షో ఆవిష్కరణ కార్యక్రమం గురువారం హౌటల్ హయత్ ప్లేస్ జరిగింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డీజీఎం మనీష్ కుమార్ సింగ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై, క్రెడారు ప్రాపర్టీ షో ప్రచార పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నిర్మాణ రంగానికి చెందిన అన్ని విభాగాలను క్రెడారు ప్రాపర్టీ షో ద్వారా ఒకే వేదికపైకి తీసుకురావడం శుభపరిణామమని అన్నారు. ప్రజల సొంతింటి కలను సాకారం చేసేందుకు క్రెడారు కృషి అభినందనీయమని కొనియాడారు. నిర్మాణ రంగంలోని అత్యాధునిక సాంకేతికత, అధునాతన ప్రాజెక్టులను ఒక చోటికి తీసుకురావడమే కాకుండా, గహ రుణ సదుపాయాలను సైతం ప్రాపర్టీ షో ద్వారా అందించడం హర్షణీయమని తెలిపారు. క్రెడారు విజయవాడ చాప్టర్ ప్రెసిడెంట్ దాసరి రాంబాబు మాట్లాడుతూ, రాష్ట్రంలోనే అతిపెద్ద ప్రాపర్టీ షోగా తమ 9వ ప్రాపర్టీ షోను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వందకు పైగా ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను ఒక వేదికపైకి తీసుకొచ్చి ఈ ప్రాపర్టీ షోను అత్యద్భుతంగా తీర్చిదిద్దుతున్నట్లు వివరించారు. సొంతింటి స్వప్నాన్ని సాకారం చేసుకోవాలనుకునే వారికి ఈ ప్రాపర్టీ షో అత్యుత్తమ అవకాశమని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో క్రెడారు రాష్ట్ర అధ్యక్షుడు వైవీ రమణరావు, విజయవాడ చాప్టర్ జనరల్ సెక్రటరీ వరదా శ్రీధర్, ట్రెజరర్ తుమ్మల వంశీ తదితరులు పాల్గొన్నారు.