ప్రజాశక్తి-ఉక్కునగరం : విశాఖ స్టీల్ కార్మికులకు తక్షణం నూతన వేతనాలు అమలుచేయాలని, ప్లాంట్‌ను పూర్తి సామర్థ్యంతో నడపాలని, ప్రయియివేటీకరణ ఆపాలనే ప్రధాన డిమాండ్లతో ఈ నెల20వ తేదీ ఈడీ (వర్క్స్) కార్యాలయం ఎదుట సిఐటియు, మిత్రపక్షాల ఆధ్వర్యాన నిర్వహించే ధర్నాను జయప్రదం చేయాలని స్టీల్ సిఐటియు ప్రధాన కార్యదర్శి యు.రామస్వామి పిలుపునిచ్చారు. స్టీల్ సిఐటియు ఆధ్వర్యాన ప్లాంట్ స్టోర్ జంక్షన్‌లో పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రామస్వామి మాట్లాడుతూ, స్టీల్‌ప్లాంట్ 100 శాతం వ్యూహాత్మక అమ్మకంలో భాగంగా కార్మికుల మనోధైర్యాన్ని ఆర్థిక అంశాలతో కృంగతీయాలనే ఉద్ధేశంతో నూతన వేతనాలు అమలు చేయడం లేదని విమర్శించారు. 1982లో సెయిల్ నుంచి విడదీసి విశాఖ ఉక్కు కర్మాగారంగా ఏర్పడిన నాటి నుంచి వేతనాలు అమలు, మరి ఏ ఇతర ఆర్థిక అంశాలు అమలులో ఎటువంటి జాప్యం లేకుండా అమలయ్యేవని గుర్తు చేశారు. నేడు జరిగిన నూతన వేతన ఒప్పందంలో క్లాజ్ - 8 ద్వారా యాజమాన్యం విశాఖ ఉక్కు కార్మికులకు అన్యాయం చేయాలని నిర్ణయిస్తే దానిని ఏఐటీయూసీ, ఐఎన్‌టియుసి సమర్ధించడంతో ఈ పరిస్థితి ఉత్పన్నమైందని వివరించారు. కనుక దీనికి వ్యతిరేకంగా ప్లాంట్‌లోని ప్రధాన విభాగాలలో ప్రచారం చేసి ఆ విభాగాధిపతుల కార్యాలయాల ఎదుట ధర్నాలు నిర్వహించి వినతి పత్రాల ద్వారా సమస్య తీవ్రతను వివరించామని తెలిపారు. అందులో భాగంగానే ఈడీ (వర్స్) కార్యాలయం ఎదుట కూడా ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. అప్పటికీ యాజమాన్య వైఖరిలో మార్పు రాకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
స్టీల్ సిఐటియు అధ్యక్షులు వైటి.దాస్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఆదేశాలతో బ్లాస్ట్‌ఫర్నేస్-3ని ఏడాదిగా ఉత్పత్తి చేయకుండా నిలుపుదల చేశారని తెలిపారు. ప్లాంటును పూర్తి సామర్థ్యంతో నడపకుండా యాజమాన్యం, ప్రభుత్వాలు కుట్ర చేస్తున్నాయని విమర్శించారు. నేడు ఇఒఐ ద్వారా ప్రయియివేట్ కంపెనీలను చొప్పించే ప్రయత్నం జరుగుతోందని, దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని స్పష్టం చేశారు. దీనిలో సెయిల్, ఎన్‌ఎండిసి వంటి ప్రభుత్వ రంగ పరిశ్రమలు, లేదా రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఇది ప్రభుత్వ రంగంగానే కొనసాగాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్టీల్ సిఐటియు నాయకులు పి.శ్రీనివాసరాజు, బి.అప్పారావు, యు.వెంకటేశ్వర్లు, గంగాధర్, టీవీకే.రాజు, కెవి.సత్యనారాయణ, నీలకంఠం, బిఎన్.మధుసూదన్, బి.మహేష్, విడివి పూర్ణచంద్రరావు, ఆర్.దుర్గాప్రసాద్, రామన్న, సత్యనారాయణ, వివిధ విభాగాల అధ్యక్ష కార్యదర్శులు, కార్మికులు పాల్గొన్నారు.










