Sep 12,2023 00:12

ప్రజాశక్తి -రేపల్లె
టిడిపి అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై టిడిపి శ్రేణులు భగ్గుమన్నాయి. రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపు ఇచ్చారు. శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులు రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తున్నారని టీడీపీ నాయకులు జీవి నాగేశ్వరరావు, జనసేన పట్టణ అధ్యక్షులు ఆర్ మహేష్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో పోలీసులు అధికార పార్టీ అనుచరులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో శనివారం నుండి టిడిపి శ్రేణులు ఆందోళనలు చేస్తున్నారు. టిడిపి బంద్‌ పిలుపు నేపధ్యంలో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. పట్టణంలో శాంతి యుతంగా బంద్ చేస్తున్న నాయకులను పోలీసుల అడుగడుగునా అడ్డుకున్నారు. ఎక్కడికక్కడే పోలీసులు వలయంలా ఏర్పడి బంద్ లో పాల్గొన్న వారిని అదుపులోకి తీసుకున్నారు. టీడీపీ, జనసేన కార్యకర్తల పట్ల  పోలీసులు దారుణంగా ప్రవర్తించారని నాయకులు ఆరోపించారు. తమ శాంతియుత ఆందోళన అడ్డుకోవడం, ఇష్టం వచ్చినట్లు లాక్కెళ్లడం దారుణమన్నారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజాస్వామ్య హక్కులను హరిస్తున్నారని ఆరోపించారు. అంబేద్కర్‌ రాజ్యాంగానికి జగన్‌ ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని అన్నారు. రానున్న ఎన్నికల్లో రాక్షస పాలనకు చమరగీతం పాడేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. ఆందోళన చేస్తున్న నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.