Aug 25,2023 00:04

రేకుల షెడ్డు పాఠశాల ముందు ఉన్న విద్యార్థులు

ప్రజాశక్తి -అనంతగిరి:పాఠశాలలల్లో నాడు నేడు పనులు మన్యంలో కానరాలేదు.గిరిజన ప్రాంతంలో మాత్రం కనీసం పాఠశాల భవనం లేక మట్టి గోడలతో నిర్మించిన రేకుల షెడ్డు కింద విద్యా బోధనలో సాగిస్తున్న దుస్థితి నెలకొంది. మండలంలోని వేంగడ పంచాయతీ డొంకగపుట్టు గ్రామంలో మండల పరిషత్‌ పాఠశాల ఉంది. నేటికీ పాఠశాలకు భవనం లేదు. ఈ పాఠశాలకు డాలింగ్‌ పుట్టు, మెట్టపాడు, పెన్నంతి, డొంకపుట్టు గ్రామాలకు చెందిన 67 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు.పది అడుగులు కలిగిన పాఠశాల రేకు షెడ్డులో 67 మంది విద్యార్థులు ఇరుకు గద్దిలో చదువులు కొనసాగిస్తున్నారు. వర్షాకాలంలో రేకులు మరమ్మతులకు గురి కాతవడంతో వర్షపు నీరు చేరడంతో నేలపై కూర్చోలేని పరిస్థితితో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. 2022 సంవత్సరంలో నాడు నేడు కింద సుమారు రూ 16 లక్షల నిధులు మంజురైనప్పటికీ పనులు మాత్రం జరగలేదు. దీంతో, పాఠశాలకు భవనం లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
పట్టించుకునే నాథుడేడీ : సిపిఎం
ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాదుడే కరువుయ్యారని వేంగడ పంచాయతీ సిపిఎం మాజీ సర్పంచ్‌ సివేరి .కొండలరావు అన్నారు. పాఠశాల భవనం లేక 67 మంది విద్యార్థులు ఇరుకు రేకుల షెడ్డు వద్ద చదువులను కొనసాగిస్తున్నారని, కలెక్టర్‌, .పిఓ, సంబంధిత విద్యాశాఖ అధికారులకు కలిసి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకున్న నాధుడే కరువయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులతో కలెక్టర్‌ కార్యాలయం వద్ద ఆందోళన చేపడతామన్నారు.