Feb 06,2022 12:23

చలికాలంలో వచ్చే తియ్యని, పుల్లని పండ్లు రేగి పండ్లు. వాటిని చూస్తుంటేనే నోరూరిపోతుంటుంది కదూ! వాటితో రకరకాల వంటలు చేసుకోవచ్చు. ఆ వెరైటీ రుచులు ఈ వారం మీకోసం..

                                                                           జామ్‌

రేగిపండుతో నోరూరే రుచులు..

కావాల్సిన పదార్థాలు : రేగిపండ్లు - పావుకిలో, కారం - స్పూన్‌, బెల్లం - రెండు స్పూన్లు, ఉప్పు - సరిపడా.
తయారుచేసే విధానం :
రేగిపండ్లని బాగా కడిగి, శుభ్రమైన వస్త్రంతో తుడవాలి.
ఒక పాత్రలో పైన పేర్కొన్న పదార్థాలన్నీ వేసి చేతితో బాగా కలపాలి. రేగిపండ్ల నుంచి లోపలి పదార్థం బయటకు వచ్చేలా చూడాలి.
మొత్తం అంతా కలిసి జామ్‌లా మారుతుంది. దానిని గాజుసీసాలో వేసి, ఫ్రిజ్‌లో నిల్వ చేయాలి. దీనిని స్నాక్‌గానూ వాడుకోవచ్చు.
రేగిపండ్లు కొంచెం పుల్లగా, వగరుగా ఉంటాయి. అందువల్ల అవసరాన్ని బట్టి రెండు స్పూన్ల బెల్లాన్ని కలుపుకోవచ్చు.
తయారీకి కావాల్సిన పదార్థాల మోతాదు మన రుచికి అనుగుణంగా మార్చుకోవచ్చు.
విత్తనాలు పూర్తిగా తొలగించి, జామ్‌ని ఫ్రిజ్‌లో నిల్వచేయాలి. లేకపోతే బూజు పట్టడం వంటి సమస్యలు రావొచ్చు.


                                                                        పులిహోర

రేగిపండుతో నోరూరే రుచులు..

కావాల్సిన పదార్థాలు : బియ్యం - 2 కప్పులు, రేగిపండ్లు - 4 కప్పులు, ఎండుమిర్చి - ఐదు, కరివేపాకు రెమ్మలు - రెండు, ఉప్పు - తగినంత, ఆవాలు - ఒకటిన్నర స్పూను, మినప్పప్పు, శనగపప్పు, పల్లీలు - రెండు స్పూన్ల చొప్పున, చింతపండు రసం - రెండు స్పూన్లు, ఇంగువ - కొద్దిగా, నూనె - పావుకప్పు, పచ్చిమిర్చి - మూడు, పసుపు - పావుస్పూను.
 

తయారుచేసే విధానం :
బియ్యం కడిగి తగినంత ఉప్పు, పసుపు వేసి ఉడికించుకోవాలి. అన్నాన్ని మరో గిన్నెలోకి మార్చి ఆరనివ్వాలి.
రేగిపండ్లను శుభ్రంగా కడిగి, విత్తనాలు తీసి మెత్తని ముద్దలా చేసుకోవాలి.
పాన్‌లో నూనె వేడిచేసి ఇంగువ, ఆవాలు, మినప్పప్పు, ఎండుమిర్చి, శనగపప్పు వేయించాలి.
ఆ తర్వాత నిలువుగా తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు రెమ్మలనూ వేయించాలి. అందులోనే రేగిపండ్ల ముద్ద, చింతపండు రసం వేసి, మంట తగ్గించి ఉడికించాలి.
రేగిపండ్లు మగ్గినట్లు అయిన తర్వాత దించేయాలి. దీన్ని అన్నంలో వేసి బాగా కలపాలి.
అంతే వేడివేడి కమ్మటి రేగిపండ్ల పులిహోర రెడీ !

                                                                         భోగిచీ భాజీ

రేగిపండుతో నోరూరే రుచులు..

కావాల్సిన పదార్థాలు : రేగిపండ్లు- కప్పు, పల్లీలు- పావుకప్పు, ఎండుకొబ్బరి ముక్కలు- ఏడెనిమిది, వంకాయలు- రెండు, చిక్కుడుకాయలు, బీన్స్‌- అయిదారు, క్యారెట్‌, ఆలు- ఒక్కోటి, పచ్చిమిర్చి- నాలుగు, చిక్కుడు గింజలు, శనగలు- పావుకప్పు చొప్పున, నూనె- తగినంత, జీలకర్ర, ఆవాలు- స్పూను, పసుపు- అరచెంచా, ఉప్పు- సరిపడా, గోడ మసాలా, నువ్వులు- రెండు స్పూన్ల చొప్పున, కొత్తిమీర తురుము- కొద్దిగా.
 

తయారుచేసే విధానం :
ముందుగా స్టౌమీద పాన్‌పెట్టి పల్లీలు, ఎండుకొబ్బరి ముక్కలు వేయించాలి. తర్వాత నువ్వులు వేసి, స్టౌ కట్టేయాలి.
ఈ మిశ్రమాన్ని చల్లార్చి పొడి చేసుకోవాలి.
కూరగాయలన్నింటినీ ముక్కలుగా తరుక్కోవాలి. స్టౌ మీద పాన్‌ పెట్టి, నూనె వేసి అది వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, నువ్వులు వేయాలి. పచ్చిమిరపకాయ ముక్కలను వేసి, కాస్త వేయించాలి.
తర్వాత కూరగాయ ముక్కలు, పసుపు, ఉప్పు వేసి మూతపెట్టి మగ్గించాలి.
అవి కాస్త ఉడికిన తర్వాత చిక్కుడు గింజలు, పచ్చి శనగలు, కొన్ని నీళ్లు పోసి, మహారాష్ట్ర ప్రత్యేకమైన గోడ మసాలా వేసి కాసేపు ఉడికించాలి.
అందులోనే రేగిపండ్లు, పల్లీల పొడి వేసి రెండు నిమిషాలు ఉడికించాలి. తర్వాత గిన్నెలోకి తీసుకుని కొత్తిమీర తురుముతో అలంకరించుకోవాలి.
అంతే భోగిఛీ భాజీ రెడీ..!

                                                                          నిల్వ పచ్చడి

రేగిపండుతో నోరూరే రుచులు..

కావాల్సిన పదార్థాలు : రేగిపండ్లు - కప్పు, కారం - పావుకప్పు, మెంతులు - ఒకటిన్నర స్పూను, ఆవాలు - ఐదు స్పూన్లు, శనగపప్పు, మినప్పప్పు- రెండు స్పూన్లు, నూనె - ముప్పావు కప్పు, ఇంగువ - అరస్పూను, ఉప్పు - తగినంత.
 

తయారుచేసే విధానం :
పాన్‌లో రెండు చెంచాల నూనె వేడిచేసి మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, మెంతులు వేయించుకుని పెట్టుకోవాలి.
ఇవి చల్లారాక మిక్సీలో మెత్తగా పొడి చేసుకోవాలి.
తర్వాత పాన్‌లో మిగిలిన నూనె వేడిచేసి, ఇంగువ వేసి దించేయాలి.
అందులోనే కారం, తగినంత ఉప్పు, ముందుగా చేసి పెట్టుకున్న పొడి, శుభ్రం చేసుకుని గాట్లు పెట్టుకున్న రేగిపండ్లు వేసి కలపాలి.
ఐదారు గంటలయ్యాక మరోసారి కలపాలి. అంతే నోరూరించే రేగిపండ్ల పచ్చడి రెడీ. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఆహా ఏమీ రుచి అనాల్సిందే !