ఊరగాయ
కావాల్సిన పదార్థాలు : రేగిపళ్లు - కప్పు, కారం - పావుకప్పు, మెంతులు - ఒకటిన్నర చెంచా, ఆవాలు - ఐదు చెంచాలు, శనగపప్పు, మినపప్పు - రెండు చెంచాల చొప్పున, నూనె - ముప్పావు కప్పు, ఇంగువ - అరచెంచా, ఉప్పు - తగినంత.
తయారుచేసే విధానం : పాన్‌లో రెండు చెంచాల నూనె వేడిచేసి మినపప్పు, శనగపప్పు, ఆవాలు, మెంతులు వేయించి పెట్టుకోవాలి. అవి చల్లారాక మిక్సీలో వేసి, మెత్తగా పొడి చేసుకోవాలి. పాన్‌లో మిగిలిన నూనె వేడిచేసి, ఇంగువ వేసి దింపేయాలి. అందులోనే కారం, తగినంత ఉప్పు ముందుగా తయారుచేసి పెట్టుకున్న పొడి, కడిగి తుడిచి అక్కడక్కడా గాట్లు పెట్టుకున్న రేగిపళ్లూ వేసి కలపాలి. ఐదారు గంటలయ్యాక మరోసారి కలపాలి. దీనిని పొడిసీసాలో పెట్టి, భద్రపరచుకోవాలి. ఇక నోరూరించే ఊరగాయ వేడివేడి అన్నంతో తినడమే ఆలస్యం.
చారు
కావాల్సిన పదార్థాలు : రేగిపళ్లు- కప్పు, వెల్లుల్లి రెబ్బలు- నాలుగు, పచ్చిమిర్చి- మూడు, ఎండుమిర్చి- రెండు, జీలకర్ర- అర టీ స్పూను, ఆవాలు- టీ స్పూను, తరిగిన ఉల్లిపాయ- ఒకటి, కరివేపాకు- రెండు రెమ్మలు, కొత్తిమీర- కొద్దిగా, నువ్వుల పొడి- రెండు టేబుల్‌స్పూన్లు, బెల్లం- టేబుల్ స్పూను, మెంతులు- అర టీ స్పూను, నూనె- రెండు టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి- అర టీ స్పూను, పసుపు- చిటికెడు, ఉప్పు- తగినంత.
తయారుచేసే విధానం : రేగిపళ్లలో విత్తనాలను తీసేసి, గుజ్జుగా చేసుకోవాలి. తర్వాత పాన్‌లో నూనెపోసి వేడెక్కాక ఎండుమిర్చి, మెంతులు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు వేసి, పోపు పెట్టుకోవాలి.
తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు, రేగిపళ్ల గుజ్జు వేయాలి. కొద్దిసేపు వేగించాక రెండు గ్లాసుల నీళ్లుపోసి, బాగా మరిగించాలి. తర్వాత ఉప్పు, నువ్వుల పొడి, బెల్లం, ధనియాలపొడి వేసి రెండు నిమిషాలు ఉడికించి, కొత్తిమీర వేసి దించేయాలి.
వడియాలు
కావాల్సిన పదార్థాలు : రేగిపళ్లు- పావుకిలో, పచ్చి మిర్చి / పండు మిర్చి- ఆరు, బెల్లం తురుము- నాలుగు టేబుల్‌స్పూన్లు, జీలకర్ర- టేబుల్‌స్పూన్, ఇంగువ- చిటికెడు, ఉప్పు- తగినంత.
తయారుచేసే విధానం : రేగిపళ్లల్లో విత్తనాలు తీసేసి (కావాలంటే ఉంచవచ్చు), గుజ్జు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. పచ్చి మిర్చి / పండు మిర్చి, జీలకర్ర, ఉప్పు, ఇంగువ, బెల్లం తురుమును వేసి, మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి. అందులోనే రేగిపళ్ల గుజ్జు కూడా వేసి బాగా కలపాలి. చిన్నచిన్న అప్పాలుగా చేసుకొని, రెండురోజులు ఎండబెట్టుకోవాలి. అన్నం తినేటప్పుడు వీటిని నూనెలో వేగించుకున్నా, అలాగే తిన్నా చాలా బాగుంటాయి.
జామ్
కావాల్సిన పదార్థాలు : రేగిపళ్లు - పావుకిలో, ఎర్రమిరప కారం - టేబుల్‌స్పూన్, బెల్లం - రెండు టేబుల్ స్పూన్లు, ఉప్పు - సరిపడా.
తయారుచేసే విధానం : రేగిపళ్లని బాగా కడిగి, శుభ్రమైన వస్త్రంతో తుడవాలి. ఒక పాత్రలో పైన పేర్కొన్న పదార్థాలన్నీ వేసి చేతితో బాగా కలపాలి. రేగిపళ్లు నుంచి లోపలి పదార్థం బయటకు వచ్చేలా చూడాలి. మొత్తం అంతా కలిసి జామ్‌లా మారు తుంది. దానిని గాజు సీసాలో వేసి, ఫ్రిజ్‌లో నిల్వ చేయాలి. దీనిని స్నాక్‌గానూ వాడుకోవచ్చు.
రేగిపళ్లు కొంచెం పుల్లగా, వగరుగా ఉంటాయి. అందువల్ల అదనంగా అవసరాన్ని బట్టి రెండు స్పూన్ల బెల్లాన్ని కలుపుకోవచ్చు. తయారీకి కావలసిన పదార్థాల మోతాదు మన రుచికి అనుగుణంగా మార్చుకోవచ్చు. విత్తనాలు పూర్తిగా తొలగించి, జామ్‌ని ఫ్రిజ్‌లో నిల్వచేయాలి. లేకపోతే బూజు పట్టడం వంటి సమస్యలు రావొచ్చు.