Jul 24,2023 00:22

మాట్లాడుతున్న నరసింహవర్మ

రేడియో తొలి ప్రసారాలకు 96 ఏళ్లు
ప్రజాశక్తి-బాపట్ల
దేశంలో తొలిసారిగా 1927 జూలై 23న ఆవిర్భవించిన ఆకాశవాణి రేడియో ప్రసారాలు నేటికీ రేడియో శ్రోతలకు విజ్ఞాన వినోదభరిత కార్యక్రమాలను శ్రవణానందకరంగా ఆకాశవాణి అందిస్తూనే ఉందని సాహితి భారతీ అధ్యక్షులు రావూరి నరసింహ వర్మ అన్నారు. ఆదివారం జాతీయ ప్రసార దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆకాశవాణి ఆవిర్భవించి 96 ఏళ్లు గడిచిన సందర్భంగా సాహితీ భారతీయ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వర్మ మాట్లాడారు. భారత దేశంలో తొలిసారిగా కలకత్తా, బొంబాయి నగరాలలో రేడియో ప్రసారాలు ప్రారంభమయ్యాయన్నారు. లార్డ్‌ ఇర్విన్‌ ఇంపీరియల్‌ బ్రాడ్‌ కాస్టింగ్‌ అనే సంస్థ ద్వారా రేడియో ప్రసారాలు ప్రారంభించారన్నారు. సాహితి భారతి కోశాధికారి ఆదం షఫీ మాట్లాడుతూ రేడియో ఒక అద్భుత విజ్ఞాన వినోద సాధనమన్నారు. ప్రచార ప్రసార సాధనాల్లో రేడియో ప్రధాన భూమిక నిర్వహించిందన్నారు. ప్రపంచంలో జరిగే అనేక వార్తా విశేషాలను రేడియోల ద్వారా ప్రజలకు చేరవేసే సాధనంగా రేడియోకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. మీడియం వేవ్‌, షార్ట్‌ వేవ్‌, ఎఫ్‌ఎంల ద్వారా రేడియోలో వివిధ నాటికలు, కథానికలు సినిమా పాటలు శాస్త్రీయ లలిత సంగీతం వంటి వినోద విజ్ఞాన కార్యక్రమాల ప్రసారాలతో రేడియో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పెరుగుతున్న సాంకేతికతతో ఇతర ప్రచార ప్రసార సాధనాలు ప్రజా బాహుళ్యంలోకి ప్రవేశించినా రేడియో తమ ఉనికి కోల్పోలేదన్నారు. రేడియో ప్రసారాలు భారతదేశంలో దాదాపు 90 శాతం వరకు విస్తరించి ఉన్నాయన్నారు. రేడియోతో పాటు ఎఫ్‌ఎం ప్రసారాలతో నేటి మానవ జీవితంలో రేడియో ఒక భాగంగా మారిపోయిందని వివరించారు. కార్యక్రమంలో ఎన్‌ కృష్ణ, మర్రి మాల్యాద్రిరావు, పువ్వాడ వెంకటేశ్వర్లు, కస్తూరి శ్రీనివాసరావు, బొడ్డుపల్లి శ్రీరామచంద్రమూర్తి, కొమ్మూరి సీతా రామాంజనేయులు, రెంటాల మురళీ రాధాకృష్ణమూర్తి, అవ్వారి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.