
ప్రజాశక్తి-మధురవాడ : వైద్య ఆరోగ్య రంగం నుంచి అంతరిక్ష రంగం వరకు మానవ ఆరోగ్యంపై రేడియేషన్ ప్రభావం ఏవిధంగా ఉందో అధ్యయనం చేయడానికి పరిశోధనలకు విస్తృత అవకాశాలు ఉన్నాయని ముంబైలోని బాబా అణుశక్తి పరిశోధన కేంద్రం మెడికిల్ గ్రూప్ అధిపతి, శాస్త్రవేత్త డాక్టర్ కె.భల్వీందర్ కె.సప్ర పేర్కొన్నారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో మానవ ఆరోగ్యంపై రేడియేషన్ ప్రభావం, పరిశోధన అవకాశాలపై ఆమె ప్రసంగించారు. వాతావరణంలో ఉండే రేడియేషన్ మానవ ఆరోగ్యంపై పెద్దగా ప్రభావం చూపదని అయితే కేన్సర్ చికిత్స, ఎక్స్‌రేల వినియోగంలో జరిగే రేడియేషన్‌పై తామ అధ్యయనం చేస్తున్నామని తెలిపారు. గగన్ యాన్ అంతరిక్ష ప్రయోగంలో వ్యోమగామిపై రేడియేషన్ ప్రభావం, తీసుకోవాల్సిన జాగ్రత్తలను అధ్యయనం చేసే అవకాశం తమకు లభించిందన్నారు. అణుభౌతిక శాస్త్రం అభ్యసించే విద్యార్థులకు ఈ రంగంలో పరిశోధనకు అవకాశాలు ఉన్నాయని తెలిపారు. బార్క్‌లోని తమ విభాగం పలు శిక్షణ కార్యక్రమాలతో పాటు డిప్లమో కోర్సులను నిర్వహిస్తోందని, వాటిని పూర్తి చేసిన వారికి దేశ విదేశాలలో ఉద్యోగఅవకాశాలు లభిస్తున్నాయని వివరించారు. కార్యక్రమానికి గీతం జీవ శాస్త్ర విభాగాల విశిష్ట ప్రొఫెసర్ హరిమిశ్ర అధ్యక్షత వహించారు.