క్రోసూరు: కుక్కలు, ఇతర పెంపుడు జంతువుల్లో ఉండే రేబిస్ వైరస్ వాటి కాటు ద్వారా మనిషి శరీరంలోకి చేరుతుందని, ఒక్కొక్కసారి రేబిస్ వ్యాధిని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలతో బయటపడటం కష్టమని పల్నాడు జిల్లా క్రోసూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారి డాక్టర్ రమాదేవి అన్నారు. సెప్టెంబర్ 28వ తేదీ గురువారం ప్రపంచ రేబిస్ వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా క్రోసూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రేబిస్ వ్యాధి పై జరిగిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడుతూ, రేబిస్ రాకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం అన్నారు. అయితే రేబిస్ వైరస్ జంతువుల లాలాజలం ద్వారా మనుషులకు ఇతర జంతువులకు వ్యాపిస్తుందని, కుక్క కరిచిన గాటును బట్టి, స్థలాన్ని బట్టి వ్యాధి లక్షణాలు ఒక రోజు నుండి చాలా రోజుల తర్వాత గాని బయటపడే అవకాశం ఉందని చెప్పారు. సకాలంలో స్పందిస్తే ఈవ్యాధిని నియంత్రించడం సాధ్యమేనని చెప్పారు. కుక్క కాటుకు పిహెచ్‌సిలో వ్యాక్సిన్ అందుబాటులో ఉందని, పెంపుడు కుక్కలకు తప్పనిసరిగా టీకాలు వేయించాలని సూచించారు. ఈ సందర్భంగా ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ మాట్లాడుతూ కుక్కకాటు వ్యాధికి టీకాలు కనుగొన్న శాస్త్రవేత్త డాక్టర్ లూయిస్ పాశ్చర్ గుర్తుగా సెప్టెంబర్ 28న ప్రపంచ రేబిస్ నివారణ దినోత్సవం జరుపు కుం టామని అన్నారు. కుక్క కరిచినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆయన వివ రించారు. కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్లు శివుడు, అమర జ్యోతి, స్టాఫ్ నర్స్ అంజమ్మ, ఎల్టి ప్రభాకర్ రావు, హెల్త్ అసిస్టెంట్ ఫ్రాంక్లిన్ తదితరులు పాల్గొన్నారు.










