Nov 22,2022 23:53

భీమిరెడ్డి జనార్థన్‌ (ఫైల్‌ఫొటో)

ప్రజాశక్తి-రాజవొమ్మంగి
ఇటీవల పిచ్చికుక్క దాడి చేయగా తీవ్రంగా గాయపడిన వైసిపి నేత భీమిరెడ్డి జనార్థన్‌ (38) రేబీస్‌ వ్యాధి సోకి కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. మండలంలోని వాతంగి సర్పంచ్‌ భీమిరెడ్డి భవాని భర్త జనార్ధన్‌పై అక్టోబర్‌ 27న తన ఇంటి వద్ద పిచ్చుకుక్క ఆకస్మికంగా దాడి చేయడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. కుటుంబ సభ్యులు ఆయన్ను తొలిత జడ్డంగి పీహెచ్సీకి తరలించగా వైద్యాధికారి సుజీ ప్రథమ చికిత్స నిర్వహించి, కుక్క కాటుకు సంబంధించిన ఇంజక్షన్‌ కూడా ఇచ్చారు. జనార్ధన్‌ కుక్కకాటుకు సంబంధించిన కోర్సు మొత్తం వాడారు. ఈనెల 20న జనార్ధన్‌కు వాంతులు అవడంతో పాటు జ్వరం తీవ్రంగా రావడంతో జడ్డంగి పీహెచ్సీకి తీసుకురాగా వైద్యాధికారి సుజీ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కాకినాడ జిజిహెచ్‌కు రిఫర్‌ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మంగళవారం మృతి చెందారు. జనార్థన్‌ మృతి పట్ల ఎంపీపీ గోము వెంకటలక్ష్మి, జెడ్పిటిసి ఒడుగుల జ్యోతి, సొసైటీ అధ్యక్షులు సింగిరెడ్డి రామకృష్ణ, వైస్‌ ఎంపిపి జుర్ర రాజేశ్వరి తదితరులు సంతాపం తెలియజేశారు. జనార్థన్‌ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.